Vemulawada Temple | వేములవాడ రాజన్న ఆలయం తాత్కాలిక మూసివేతపై కలకలం.. భక్తుల ఆగ్రహం
Vemulawada Temple | తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించడం తో భక్తుల్లో అసంతృప్తి చెలరేగింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో రోజూ వేలాది మంది భక్తులు దర్శనార్థం వస్తుంటారు. కానీ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కారణంగా ఆదివారం (ఈ రోజు) నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
#image_title
భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఆలయ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం, రాజన్నకు నిర్వహించే అన్ని రకాల పూజలు, మొక్కులు, ఆర్జిత సేవలు ఈ కాలంలో భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తారు. కొడె మొక్కులు, అభిషేకాలు, నిత్య కల్యాణం, చండీహోమం వంటి సేవలు కూడా అక్కడే జరగనున్నాయి.ప్రధాన రాజరాజేశ్వర ఆలయంలో మాత్రం కేవలం ఏకాంత సేవలు మాత్రమే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యే వరకు దర్శనాలు నిలిపివేస్తామని, భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయం తిరిగి ఎప్పుడు తెరుచుకుంటుందనేది స్పష్టంగా చెప్పనప్పటికీ, కొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ తాత్కాలిక మూసివేతపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. “భక్తుల మనోభావాలను కించపరిస్తే చూస్తూ ఊరుకోము” అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆలయం మూసివేస్తే కార్యకర్తలతో కలిసి తలుపులు తెరవడానికి సిద్ధం అని స్పష్టం చేశారు.