Revanth Reddy : కేసీఆర్ అసలు రహస్యం బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి?
Revanth Reddy : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను మోసం చేసింది. ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ చట్టాల ఊసే ఎత్తడం లేదు. టీఆర్ఎస్ పార్టీ.. వ్యవసాయ చట్టాల్లో మాకేం సంబంధం లేదు.. అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కించిత్ కూడా రైతులపై ప్రేమ లేదు. వాళ్లను పట్టించుకుంటున్న దాఖలాలే లేవు.. అంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రైతుల కోసం నోరు మెదపని సర్కారు మనకు అవసరమా? ఓవైపు రైతులు ఎన్నో నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎందుకు సీఎం కేసీఆర్ స్పందించడం లేదు.. అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి.. రాజీవ్ భరోసా యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతుల సమస్యలను ఆయన తెలుసుకుంటున్నారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు.
Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్
ఓవైపు పాదయాత్ర చేస్తూనే.. రైతుల సమస్యలను తెలుసుకుంటూనే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి.. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
ఈసందర్భంగా తన పాదయాత్రలో మాట్లాడిన రేవంత్… రైతులకు అండగా ఉండాల్సిన కేసీఆర్ సర్కారు… రైతులను పట్టించుకోవడం లేదని.. అసలు రైతుల గురించే మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే టీఆర్ఎస్ పార్టీ వణుకుతోందని… ఢిల్లీకి వెళ్లి వచ్చాక కేసీఆర్ కేంద్రం గురించి మాట్లాడాలంటేనే వణికిపోతున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Revanth Reddy : అమిత్ షాను కలవగానే.. కేసీఆర్ కు చలిజ్వరం
ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కానీ… కేంద్ర మంత్ర అమిత్ షాతో భేటీ అయి వచ్చాక.. కేసీఆర్ కు చలిజ్వరం వచ్చింది. అందుకే… తన ఫాంహౌస్ నుంచి బయటికి రావడం లేదు. హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలను, రైతులను మరిచిపోయారు.. అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపి.. కార్పొరేట్లకు రైతులు బానిసలుగా మార్చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ… రెండు పార్టీల గద్దెలు కూలాల్సిందే.. వాటి దిమ్మ తిరగాల్సిందే… అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.