Sajjala Ramakrishna Reddy : త్వరలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడటంతో పార్టీలన్నీ ఇప్పటి నుంచే సమాయాత్తం అవుతున్నాయి. ఇక ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. టీడీపీ నేతలు వైసీపీ నేతలను, వైసీపీ నేతలు టీడీపీ నేతలపై నోరు పారేసుకోవడం కామన్ అయిపోయింది. చంద్రబాబు మళ్లీ పగటి వేషగాడిలా మారాడు. మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారు.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. గుంట నక్కలు అన్నీ ఏకం అవుతున్నాయి.. అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 ఏళ్లు పూర్తయింది. ఈనేపథ్యంలో తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు సజ్జల. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలి. గుంట నక్కలు తిరుగుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి.. అంటూ ఆయన మండిపడ్డారు. వైసీపీ నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా వైసీపీ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర అంటూ అభివర్ణించారు.

Sajjala Ramakrishna Reddy : వైసీపీ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర
ఇప్పటి వరకు ఏపీలో కోటీ 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయని సజ్జల సగర్వంగా చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తోందని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్ని పథకాలు అమలు చేశారు. పేదలకు చంద్రబాబు చేసిందేం లేదు. వాళ్ల ఏం చేయరు.. చేసే వాళ్లను చేయనివ్వరు.. అంటూ మండిపడ్డారు. వైసీపీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి. గుంట నక్కలతో జాగ్రత్తగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వచ్చేలా కృషి చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. దానికి మరికొంత సమయం పడుతుందని సజ్జల చెప్పుకొచ్చారు.