Cricketer | డ్రగ్స్‌కి బానిసైన జింబాబ్వే మాజీ కెప్టెన్ షాన్ విలియమ్స్ .. ముగిసిన అంతర్జాతీయ కెరీర్
Cricketer |జింబాబ్వే క్రికెట్‌లో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ షాన్ విలియమ్స్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ అకస్మాత్తుగా ముగిసింది. మాదకద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందేందుకు రెహాబిలిటేషన్ కార్యక్రమంలో చేరిన అనంతరం, ఆయన్ను ఇకపై జాతీయ జట్టులో ఎంపిక చేయబోమని జింబాబ్వే క్రికెట్ బోర్డు (ZC) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
#image_title
కెరీర్‌కి ముగింపు..
బోర్డు తన ప్రకటనలో “విలియమ్స్‌పై నిర్ణయం సులభం కాదు. కానీ మా కాంట్రాక్ట్ ప్లేయర్లు అత్యున్నత ప్రొఫెషనలిజం, క్రమశిక్షణ, యాంటీ-డోపింగ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. విలియమ్స్ గతంలో పలు సందర్భాల్లో క్రమశిక్షణా ఉల్లంఘనలు, అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. ఇవి జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపించాయి” అని పేర్కొంది.
గత సెప్టెంబర్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్‌కు విలియమ్స్ అందుబాటులో లేకపోవడంతో బోర్డు అంతర్గత విచారణ చేపట్టింది. ఆ విచారణలో విలియమ్స్ స్వయంగా “కొంతకాలంగా మాదకద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్నాను, ప్రస్తుతం దానికి చికిత్స పొందుతున్నాను” అని వెల్లడించినట్లు జింబాబ్వే క్రికెట్ తెలిపింది. 39 ఏళ్ల షాన్ విలియమ్స్ 2005లో జింబాబ్వే తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, ముఖ్యంగా వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 164 వన్డేల్లో 5217 పరుగులు సాధించి, బౌలింగ్‌లో 86 వికెట్లు తీశారు. ఆయన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 4/43.