Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ సమస్యలు ఉన్నవారు తినకండి
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు ఎలా వేచిచూస్తారో, అలాగే సీతాఫలంకోసం కూడా అలా వేచిచూస్తారు. ఆరోగ్యకరమైన పండు అయినప్పటికీ, కొందరు వ్యక్తులకు సీతాఫలం తినడం ప్రమాదకరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణ సమస్యలున్నవారుమానుకోండి
సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు, కడుపు నిండిన భావన వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాలను దూరంగా ఉంచడం మంచిది. సీతాఫలం గుజ్జు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ, విత్తనాలు విషపూరితంగా ఉంటాయి. పండు తినేటప్పుడు విత్తనాలను తొలగించడం అత్యంత అవసరం. పొరపాటున విత్తనాలను మింగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
సీతాఫలం ఇనుముకు మంచి మూలం. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇనుము స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, కడుపుపోర వాపు, పూతలు వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి సీతాఫలం తినడం వల్ల దురద, దద్దుర్లు, చికాకు వంటి అలెర్జీ లక్షణాలు కనబడవచ్చు. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పండు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.