TDP : ఆ జిల్లాలో పూర్తిగా భూస్థాపితం అయిన టీడీపీ.. ఇలా అయితే.. 2024 లో టీడీపీ పరిస్థితి ఏంటో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : ఆ జిల్లాలో పూర్తిగా భూస్థాపితం అయిన టీడీపీ.. ఇలా అయితే.. 2024 లో టీడీపీ పరిస్థితి ఏంటో?

 Authored By sukanya | The Telugu News | Updated on :29 August 2021,7:00 am

కర్నూలు : కర్నూలు జిల్లాలో టీడీపీ పూర్తిగా చతికిల పడింది. పార్టీ కార్యక్రమాలకు టీడీపీ నేతలు దూరంగా ఉంటున్నారు. అధిష్టానం వ్యవహారం నచ్చక కొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీకి చావు దెబ్బ తగిలింది. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీలు వైఎస్సార్‌సీపీ వశమయ్యాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కూడా టీడీపీకి గడ్డు పరిస్థితి తప్పదనే భావనకు పార్టీ శ్రేణులతో పాటు నేతలు వచ్చారు.

దీంతోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ సైకిల్‌ దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. ఆయన కుమారుడు టీజీ భరత్‌ మాత్రం టీడీపీలో అంటీముట్టనట్లు కొనసాగుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు కేఈ ఫ్యామిలీ హాజరు కావడం లేదు. సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీజీ భరత్, కేఈ శ్యాంబాబు పార్టీ వీడతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీజీ భరత్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బుజ్జగించినట్లు సమాచారం. కోడుమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన మాజీ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి వైఖరి కార్యకర్తలకు మింగుడుపడటం లేదు.

TDP

TDP

ఎవరి దారి వారిదే.. TDP

కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సొంత నియోజకవర్గమైనా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నందికొట్కూరులో టీడీపీ నేత బండి జయరాజు ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించారు. నియోజకవర్గాన్ని పర్యవేక్షించే మాండ్ర శివానందరెడ్డి హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడే లేరు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆదోనిలో మీనాక్షినాయుడు వయోభారంతో రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి, పత్తికొండలో శ్యాంబాబు ఇప్పటి వరకు పార్టీ తరఫున ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు.

Kurnool Politics

Kurnool Politics

ఆలూరులో కోట్ల సుజాతమ్మ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తరచూ వివాదాల్లో చిక్కుకుని కేసులు, కోర్టు వ్యవహారాల్లో మునిగిపోయారు. శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. పాణ్యం, బనగానపల్లె, కర్నూలు నేతలు స్థానికంగానే ఉంటున్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. జిల్లాలోనూ టీడీపీకి చెందిన కొందరు నేతలకు కూడా అధినేత వ్యవహారం నచ్చడం లేదని తెలుస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది