TDP : అప్పుడు అచ్చెన్న… ఇప్పుడు ధూళిపాళ్ల… జగన్ నెక్స్ ట్ టార్గెట్ ఎవరు?
TDP : వైసీపీ అధికారంలోకి రాకపోదు… టీడీపీ నేతల ఆటకట్టించకపోదు… అని 2014 నుంచి 2019 ఎన్నికల వరకు వైసీపీ నేతలు టీడీపీ నేతలను బెదిరించిన సమయం అది. వైసీపీ నేతల మీద లేనిపోని కేసులు పెట్టించి అప్పటి టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలను జైలులో పెట్టించిందనే ఆరోపణలు ఉన్నవే కదా. అప్పుడు వైసీపీ నేతలు అదే మాట చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తాం మా సంగతి అని. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.. టీడీపీ నేతల అక్రమాల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. అయితే… ఇప్పుడు టీడీపీ నేతల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే… మీరే ఎప్పటికీ అధికారంలో ఉండరు కదా. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుంది… అప్పుడు చెబుతాం మీ సంగతి అని ఇప్పుడు టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే… ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి… బండ్లు ఓడలు అవుతాయి. అది జరగాల్సిందే. అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికారం ఉన్నన్నాళ్లు వాళ్ల రాజ్యం నడుస్తుంది. లేకపోతే అంతే సంగతులు. ఇప్పుడు ఈ సోది రామాయణం ఎందుకంటే.. ఇవాళ ఉదయం.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 100 మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి మరీ అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులకు హాండ్ ఓవర్ చేశారు.
ఒక్కరు కాదు… ఇద్దరు కాదు… తెల్లవారుజామున నరేంద్ర ఇంటిని 100 మంది పోలీసులు చుట్టు ముట్టడంతో అసలు ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులకు అప్పగించారు. ఏసీబీ అధికారులు నరేంద్రను వెంటనే అక్కడి నుంచి తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. సంగం డెయిరీకి ప్రస్తుతం నరేంద్ర చైర్మన్ గా ఉన్నారు. ఆ సంస్థలో పలు అక్రమాలు జరిగాయట. దానిపై ఏసీబీ కేసు నమోదు చేసి… ఆ సంస్థ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసింది.
నరేంద్రది గుంటూరు జిల్లా చింతలపూడి. అక్కడే ఆయన నివాసం ఉంటున్నారు. చింతలపూడి గ్రామానికి వందలమంది పోలీసులు వెళ్లడంతో గ్రామస్థులు కూడా భయపడ్డారు. నరేంద్రపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. అలాగే… ఆయన భార్యకు కూడా ఏసీబీ నోటీసులు అందించింది. అందులో నరేంద్ర అరెస్ట్ కు సంబంధించిన వివరాలను పొందుపరిచింది.
TDP : అచ్చెన్నాయుడు కూడా అదే తరహాలో అరెస్ట్
కట్ చేస్తే… ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం మీకు గుర్తుందా? సేమ్… అచ్చెన్న ఇంటిని తెల్లవారుజామున వందలమంది పోలీసులు చుట్టుముట్టి మరీ అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అంటే.. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ నేతల అరెస్ట్ కు అదే ఫార్ములాను ఉపయోగిస్తోంది. అప్పుడు అచ్చెన్నను అలాగే అరెస్ట్ చేశారు… ఇప్పుడు ధూళిపాళ్లను అరెస్ట్ చేశారు. నెక్స్ ట్ ఎవరు జగన్.. అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి…. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి మీరు సాధించేదేం లేదు. మీరు ఎంత భయపెట్టినా… టీడీపీ నేతలు భయపడరు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండవచ్చు గాక. కానీ… ఏదో ఒక రోజు టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు తీవ్ర పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.