TDP : పాయె.. ఉన్న ఒక్క ఆశ కూడా పాయె? అక్కడ టీడీపీ కంచుకోట కూడా బద్దలు అయిపాయె?
TDP విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీపై పోరాటం చేస్తున్న చంద్రబాబుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో టిడిపి నేతల మధ్య సఖ్యత లేకపోవడం, కొన్నిచోట్ల కీలకంగా వ్యవహరించాల్సిన నేతలు సైలెంట్ గా వ్యవహరించడం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. ఇక బెజవాడ పాలిటిక్స్ అధినేత చంద్రబాబుకు సైతం చిరాకు తెప్పిస్తున్నాయి. విజయవాడలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతలు ఉన్నా, పార్టీని బలోపేతం చేయడంలో వారి పాత్ర లేకుండా పోతుంది. వారిలో వారికే సఖ్యత లేకపోవడం, పార్టీ కార్యక్రమాలు అంటే అందరు నేతలు కలిసి రాకపోవడమే అందుకు కారణం.
పట్టుమని పది మంది నేతలు కూర్చొని మాట్లాడుకుని ఒకే మాట మీద ముందుకు సాగిన పరిస్థితి విజయవాడలో అసలే కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బెజవాడ టిడిపి పాలిటిక్స్ సాగుతున్నాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నాని ఉన్నారన్న మాటే కానీ వారు పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది స్థానిక పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో కీలకంగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమా గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో, అధికార పార్టీపై గట్టిగా పోరాటం చేయలేకపోతున్నారు.
నేతలున్నా.. ఎవరి దారివారిదే.. TDP
విజయవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనే తెలుగు తమ్ముళ్ళ మధ్య ఉన్న వర్గ విభేదాలు బాహాటంగానే చర్చనీయాంశమయ్యాయి. చెప్పులతో కొట్టేవాళ్ళమని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే దాకా వెళ్ళాయి. ఇక ఇటీవల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాకు ఎంపీ ఉన్నా లేనట్టే అని కేశినేని నాని పై చేసిన వ్యాఖ్యలు వారి మధ్య ఉన్న విభేదాలను అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాయి. ఇక పార్టీ నేతల మధ్య సఖ్యత లేని కారణంగా బోండా ఉమ, నాగుల్ మీరా కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. బుద్ధ వెంకన్న, కేశినేని నాని, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, బోండా ఉమ, నాగుల్ మీరా వంటి కీలక నాయకులు ఉన్నప్పటికీ విజయవాడలో తెలుగుదేశం పార్టీ పట్టును నానాటికీ కోల్పోతోంది.
వైసీపీ నుండి టీడీపీకి జంప్ అయిన వంగవీటి రాధా అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్ధం కాని పరిస్థితి ఉంది. ఎవర్ని ఏమన్నా పార్టీ వదిలిపోతారేమో అన్న భయం అధినేత చంద్రబాబుకు లేకపోలేదు. ఇది చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారయింది. ఒకపక్క అధికార పార్టీతో పోరాటం సాగించాలని చంద్రబాబు భావిస్తుంటే, పార్టీ నేతల అంతర్గత కలహాలతో బెజవాడలో టిడిపి కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగి నేతల మధ్య సఖ్యత లేకుంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బెజవాడ రాజకీయాల్లో మనుగడ సాగించటం కష్టమనే భావన వ్యక్తమవుతోంది.