TS Govt | తెలంగాణ రైతులకు మరో శుభవార్త .. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధం
TS Govt | తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంతోషకరమైన ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెలాఖరులోగా వరి కోతలు ప్రారంభం కానుండగా, అక్టోబర్ మొదటి వారం నుంచే అధికారికంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

#image_title
సన్నవరి రైతులకు బోనస్ కొనసాగింపు
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సన్నవరి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చిన్నచైన రైతులకు పెద్ద ఊరటగా మారనుంది. ఈ బోనస్ కారణంగా ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం 60.39 లక్షల ఎకరాల నుంచి 65.96 లక్షల ఎకరాలకు పెరిగిందని అధికారిక సమాచారం.
రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 8,332 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత ఖరీఫ్‌లో 7,139 కేంద్రాలే ఉండగా, ఈసారి సంఖ్య గణనీయంగా పెంచడం గమనార్హం. గతేడాది ధాన్యం ఉత్పత్తి: 146.28 లక్షల టన్నులు, కొనుగోలు చేసిన ధాన్యం: 91.28 లక్షల టన్నులు, ఈ ఏడాది ఉత్పత్తి అంచనా: 159.14 లక్షల టన్నులు, నిర్ణయించిన కొనుగోలు లక్ష్యం: 74.99 లక్షల టన్నులుగా ఉంది. సన్న మరియు దొడ్డు వరి రకాల కోసం వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించేలా ప్రభుత్వం యోచిస్తోంది.