Warangal : రామప్ప ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రులు
Warangal : వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం అనేది దేశానికే గర్వకారణం.. అని తెలంగాణ మంత్రులు అన్నారు. రామప్ప ఆలయ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పింది సీఎం కేసీఆర్ అని.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే రామప్ప ఆలయానికి సరైన గుర్తింపు వచ్చిందని తెలంగాణ పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
ఆయనతో పాటు.. ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. యునెస్కో గుర్తింపు రావడం వల్ల.. రామప్ప పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చెందుతుందని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆలయాన్ని సందర్శించిన మంత్రులు.. ఆలయంలోని రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. పోరాటాల గడ్డ అయిన తెలంగాణలో రామప్ప దేవాలయం ఉండటం మన అదృష్టం అని మంత్రులు పొగిడారు. రామప్ప దేవాలయాన్ని కట్టించింది కాకతీయులే అయినా.. రామప్ప దేవాలయ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పింది… దానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేసింది మాత్రం సీఎం కేసీఆర్ అని మంత్రులు స్పష్టం చేశారు.