YSRCP : వైసీపీకి వచ్చే ఎన్నికల్లో నిజ్జంగా వచ్చే సీట్లు ఎన్నంటే.!
YSRCP : వచ్చే ఎన్నికల్లో.. అంటే, వైసీపీ గనుక ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా, వెళ్ళకపోయినా.. అసలంటూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా, వైసీపీకి వచ్చే సీట్లు ఎన్ని.? అన్నదానిపై రకరకాల వాదనలు ఇటు రాజకీయ పార్టీల్లోనూ, అటు రాజకీయ విశ్లేషకుల్లోనూ కనిపిస్తున్నాయి. ఎవరికి తోచిన సంఖ్య వారు చెప్పేస్తున్నారు. ఇంతకీ, కింది స్థాయిలో పరిస్థితులు ఎలా వున్నాయి.? అన్నదానిపైనా ఎవరి గోల వారిదే.!
వైసీపీ మాత్రం, ‘151కి ఒక్కటి కూడా తగ్గదు.. పెరగడం అయితే తథ్యం. ఒకటి పెరుగుతుందా.? ఇరవై పెరుగుతాయా.? అన్నదానిపైనే మా ఫోకస్ అంతా..’ అంటోంది. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలు కావొచ్చు, స్థానిక ఎన్నికలు కావొచ్చు..
గడచిన మూడేళ్ళలో జరిగిన అన్ని ఎన్నికల విషయంలోనూ వైసీపీ ఏం చెబితే అదే జరుగుతోంది. అయితే, సాధారణ ఎన్నికలకీ, ఉప ఎన్నికలు అలాగే స్థానిక ఎన్నికలకీ చాలా తేడా వుంటుంది. అది వైసీపీకి కూడా బాగా తెలుసు. ప్రతి ఇంటికీ నేరుగా సంక్షేమ పథకాల తాలూకు ఫలాలు అందుతున్న దరిమిలా, ఓటర్లు వైసీపీని తమ సొంత పార్టీగా భావిస్తున్నారనీ, వైసీపీ ప్రభుత్వాన్ని తమ సొంత ప్రభుత్వంగా గౌరవిస్తున్నారనీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు.
ఎంత గొప్పగా పరిపాలించినాసరే, ప్రభుత్వం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత వుంటుంది.
అది సర్వసాధారణం. ఆ వ్యతిరేకత అనేది చీలిపోవాలని వైసీపీ కోరుకుంటోంది. చీలిపోతే, వైసీపీకి 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే కాసిని సీట్లు ఎక్కువగానే వచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవేళ వైసీపీ వ్యతిరేక ఓటు గనుక చీలకపోతే, 2019 ఎన్నికల్లో కంటే వైసీపీకి సీట్లు తగ్గుతాయి. కానీ, ఆ తగ్గడం అనేది చాలా నామమాత్రమేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. తాజా అంచనాల ప్రకారం, టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే వైసీపీకి, 130 ప్లస్ సీట్లు రావొచ్చునట. విడివిడిగా పోటీ చేస్తే, కనీసం 152 సీట్లు వచ్చే అవకాశం వుందని అంటున్నారు.