TRS Rajyasabha : టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. కేసీయార్ రూటే సెపరేటు.!
TRS Rajyasabha : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తమ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్ళబోయే నాయకుల పేర్లను ఖరారు చేశారు. అందరూ ఊహించినట్లుగానే హెటిరో పార్ధసారధి, నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావు పేర్లను ప్రకటించారు. ఈ ఇద్దరితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, బీసీ నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పేరు కూడా ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సమితి. రాజ్యసభ ఎంపీగా రెండేళ్ళ పదవీ కాలం వుండగానే బండ ప్రకాష్ రాజీనామా చేశారు గతంలో.
ఆయనకు కేసీయార్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విషయం విదితమే.ఆ పదవీ కాలం రెండేళ్ళు మిగిలి వున్న దరిమిలా, ఆ స్థానానికి పై ముగ్గురిలో ఎవర్ని కేసీయార్ ఎంపిక చేశారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రేపే ఆ స్థానానికి నామినేషన్ వేసేందుకు చివరి రోజు కావడం గమనార్హం.ఇదిలా వుంటే, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా వున్న ఇద్దరిలో ఒకరు డి.శ్రీనివాస్. ఆయన గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితికి దూరంగా వుంటున్నారు. కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి చేరడంతో డి.శ్రీనివాస్‌ని రాజ్యసభకు పంపారు కేసీయార్. తెలంగాణ రాష్ట్ర సమితికి దూరంగా వుంటున్నా, రాజ్యసభ సభ్యుడిగా ఇప్పటిదాకా కొనసాగారు ధర్మపురి శ్రీనివాస్.
మరొక రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఆయన తిరిగి రాజ్యసభకు వెళ్ళేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయన సుముఖంగా వుండి వుంటే, ఖచ్చితంగా కొనసాగింపు వుండేదని గులాబీ వర్గాలంటున్నాయి. డీ.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాలకు నామినేషన్ వేసేందుకు చివరి తేదీ ఈ నెల 31.కాగా, రాజ్యసభకు ఖరారైన అభ్యర్థులు ఈ రోజు కేసీయార్‌ని కలిశారు. వారికి రాజ్యసభ అభ్యర్థిత్వాలకు సంబంధించిన బి-ఫారంలను కేసీయార్ అందజేయడం జరిగింది.