Hunger Crisis : అక్క‌డ ఆక‌లి రాజ్య‌మేలుతున్న‌ది.. 30 శాతం మందికి తిండి క‌రువు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hunger Crisis : అక్క‌డ ఆక‌లి రాజ్య‌మేలుతున్న‌ది.. 30 శాతం మందికి తిండి క‌రువు..!

 Authored By nagaraju | The Telugu News | Updated on :3 September 2021,10:32 am

ఆఫ్ఘ‌నిస్థాన్ దుస్థితిపై ఐక్య‌రాజ్య‌స‌మితి ఆందోళ‌న‌

Hunger Crisis: తాలిబన్‌లు ఆక్రమించిన ఆఫ్ఘ‌నిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. తాలిబన్‌ల‌ భయంతో వణికిపోతోన్న ఆఫ్ఘ‌న్ వాసులను రానున్న రోజుల్లో దేశంలో ఆహార సంక్షోభం తీవ్రమవనుంద‌నే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో 30 శాతానికిపైగా పౌరులకు రోజుకు కనీసం ఒకపూట భోజనం దొర‌క‌ని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తంచేసింది.

ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతం ఉన్న‌ ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని కూడా ఐక్య‌రాజ్య‌స‌మితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘ‌న్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.

Hunger Crisis: చిన్నారుల్లో పెరుగుతున్న పోష‌కాహార లోపం..

దేశంలో సంక్షోభ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆహారకొరత ఏర్పడింది. దాంతో ఐదేండ్ల‌ కంటే చిన్నారుల్లో సగం మందికిపైగా తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అంతేగాకుండా ముప్పై శాతం మంది పౌరులకు సరైన తిండి దొరకడం లేదని ఐరాస హ్యుమానిటేరియన్‌ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. వారంతా ప్రతిరోజు భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు ఉంద‌ని పేర్కొన్న‌ది. ఆహారం, వైద్య సదుపాయాలు, ఆహారేతర అత్యవసర వస్తువులను తక్షణమే అందించే చర్యల ద్వారా ఆఫ్ఘ‌న్ మరింత విపత్కర పరిస్థితుల్లోకి దిగజారకుండా నిరోధించవచ్చని అభిప్రాయపడింది.

ఆకలితో ఉన్న లక్షల మందిని ఆదుకునేందుకు ఐరాస కృషి చేస్తున్నప్పటికీ.. సెప్టెంబర్‌ చివరి నాటికి ప్రపంచ ఆహార కార్యక్రమం నిల్వలు నిండుకునే ప్రమాదం ఉండ‌టం ఆందోళన కలిగిస్తున్న‌ద‌ని ఆఫ్ఘ‌న్‌లో ఐరాస హ్యుమానిటేరియన్‌ విభాగం ప్రతినిధి రమీజ్‌ అలక్‌బరోవ్‌ పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆఫ్ఘ‌న్‌కు సహకరించేందుకు మరిన్ని నిధులు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుత డిమాండ్‌ దృష్ట్యా కేవలం దీనస్థితిలో ఉన్న చిన్నారుల ఆహారం కోసమే 200 మిలియన్‌ డాలర్లు అవసరమని అంచనా వేశారు. ఇందుకు అత్యవసర సహాయం కోసం ఐరాస త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.

Hunger Crisis: ప్ర‌పంచ బ్యాంకు నుంచి నిలిచిన ఆర్థిక సాయం..

ఇదిలావుంటే, ఆఫ్ఘ‌నిస్థాన్‌ ప్రభుత్వానికి నిధులు ఎక్కువగా అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచే వస్తాయని అంచనా. గతకొన్ని రోజులుగా అక్కడ ఏర్పడ్డ పరిస్థితులతో ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఆర్థిక సహాయాన్ని నిలిపివేశాయి. వీటితోపాటు విదేశాల్లో ఉన్న నిధులను తాలిబన్‌లు వినియోగించకుండా అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దాంతో ఆఫ్ఘ‌న్‌కు ఆర్థిక కష్టాలు మొదలైనట్లు తెలుస్తున్న‌ది. ఇలాంటి పరిస్థితుల్లో అనేకమంది ఆఫ్ఘ‌న్‌ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

nagaraju

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది