Chandrababu : ‘ ఆమె’ కి చంద్రబాబు కీలక బాధ్యతలు.. తెలుగుదేశంలో ఏం జరుగుతోంది..!
Chandrababu : ఇంకో సంవత్సరంలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండూ ఒకేసారి వస్తుండటంతో ఏపీలో రాజకీయ వేడి ప్రారంభం అయింది. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గ ఇంచార్జ్ లు లాంటి వాటిపై దృష్టి పెట్టాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా వరుపుల సత్యప్రభను నియమించారు.
ఆమె ఎవరో కాదు.. ఇటీవల మరణించిన టీడీపీ నేత వరుపుల రాజా భార్య. దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గానికి రాజా భార్యనే నియమిస్తున్నట్టు టీడీపీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. రాజా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. అలాగే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు డీసీసీబీ చైర్మన్ గానూ ఉన్నారు. ఆయన టీడీపీకి ఎన్నో సేవలు చేశారు. అందుకే.. రాజా భార్యకు తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలను ఇచ్చారు. నిజానికి.. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రాజా ఓడిపోయాడు.
TDP : 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఓడిపోయిన రాజా
ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేశారు. కానీ.. పార్టీ నాయకులు బుజ్జగించడంతో మళ్లీ టీడీపీలో చేరారు. ఆ తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. కానీ.. ఇటీవల ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ప్రత్తిపాడు ప్రాంతంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంది. ప్రత్తిపాడు మాత్రమే కాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో ఎక్కువగా కాపు వర్గం ఉండటంతో.. వచ్చే ఎన్నికల్లో వీటిలో దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందులో భాగంగానే సత్యప్రభకు నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.