Chandrababu : వార్ వన్ సైడ్.! చంద్రబాబు ఆ మాట చెప్పడానికి అర్హుడా.?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి 2019 ఎన్నికల్లో చావు దెబ్బ తగిలింది రాజకీయంగా. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఏనాడూ ఎదుర్కోనంత ఘోర పరాజయం అది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘దొంగ..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అండ్ టీమ్ ఎగతాళి చేస్తే, దానికి ప్రజలు సరైన సమాధానమిచ్చారు 2019 ఎన్నికల్లో. ‘ఒక్క ఛాన్స్..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని దేబిరించినందుకే ఆయనకు అధికారం దక్కిందని టీడీపీ చెప్పొచ్చుగాక. కానీ, ఏకపక్ష విజయాన్ని వైసీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారంటే, అదంతా చంద్రబాబు అండ్ టీమ్ మీద ప్రజల్లో వున్న వ్యతిరేకత వల్లనే సాధ్యమయ్యింది.
‘వార్ వన్ సైడ్’ అని దాన్నే అంటారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 అసెంబ్లీ నియోజకవర్గాల్ని వైసీపీ గెలచుకుంది. 25 లోక్ సభ సీట్లలో 22 సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఇంతటి ఘన విజయాన్ని టీడీపీ అందుకోగలదా.? అవకాశమే లేదు.కానీ, చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని చెబుతున్నారు. ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్..’ అంటూ నినదిస్తున్నారు కూడా. వార్ వన్ సైడ్ సంగతి తర్వాత.. ముందైతే, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈసారైనా నారా లోకేష్ గెలుస్తారని ఘంటాపథంగా చంద్రబాబు చెప్పగలరా.? పుత్రరత్నం టాలెంట్ మీద చంద్రబాబు కన్నా అవగాహన ఇంకెవరికి వుంటుంది.?
నారా లోకేష్ సంగతేంటో తెలుసు గనకనే, మరో ఆలోచన లేకుండా.. ఎమ్మెల్సీని చేసేసి.. మంత్రి పదవి ఇచ్చేసుకున్నారు చంద్రబాబు. భవిష్యత్తులో లోకేష్ మంత్రి అయ్యే అవకాశం లేదనీ, చట్ట సభలకూ వెళ్ళడని బహుశా చంద్రబాబు అప్పుడే డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఇదిలా వుంటే, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించేందుకు కుప్పంలోనే బీభత్సమైన స్కెచ్ సిద్ధం చేసింది వైసీపీ. చంద్రబాబు చెప్పింది నిజమే.. వార్ వన్ సైడ్ అవనుంది.. ఈసారి కూడా 2019 ఎన్నికల్లోలానే, అంతకు మించిన రీతిలో వార్ వన్ సైడ్.. అదీ వైసీపీకి అనుకూలంగా మారబోతోంది.