Chiranjeevi : బీజేపీకి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికితే ఏమౌతుంది.?
Chiranjeevi : సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా.? రారా.? అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎవరి విశ్లేషణలు వారివే. చిరంజీవి మాత్రం, తనకు రాజకీయాలు సరిపడవని ఎప్పుడో తేల్చేశారు. ‘నేను అందరివాడిలా వుండాలనుకుంటున్నాను. కేవలం సినీ పరిశ్రమలోనే అలా వుండగలం..’ అంటూ రాజకీయాల్లో తాను తిన్న ఎదురు దెబ్బల నేపథ్యంలో చిరంజీవి స్పష్టంగానే వ్యాఖ్యానించేస్తున్నారు. కానీ, చిరంజీవిని తమవైపుకు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ చాలా చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది.
గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీలో కీలక పదవి దక్కిన తర్వాత, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు, మెగా ఆశీర్వాదం పొందారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే, స్వయంగా చిరంజీవికి ఆహ్వానం పలికారు.. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విగ్రహావిష్కరణ చేయనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితితోనూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనూ చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయి. కాంగ్రెస్ పార్టీతోనూ చిరంజీవికి పాత పరిచయాలున్నాయ్. రాజకీయాలకు దూరంగా వుంటేనే, ఈ పరిచయాలు, ఈ స్నేహాలూ ఇలా వుంటాయి. ఒకవేళ చిరంజీవి ఏదన్నా పార్టీలో చేరితే అంతే సంగతులు.
ఏదన్నా పార్టీకి మద్దతిచ్చినా ఆయన సీన్ మారిపోతుంది ఒక్కసారిగా. బీజేపీ వైపు చిరంజీవి ఆలోచన చేస్తే, తెలంగాణలో తలనొప్పి వచ్చిపడుతుంది. సో, ఇవన్నీ చిరంజీవి ఎప్పుడో బేరీజు వేసుకుని వుంటారు. అందుకే, బీజేపీ నుంచి ఎన్ని ఆఫర్లు వస్తున్నా, ‘సున్నితంగా’ తిరస్కరించేస్తున్నారు చిరంజీవి. కానీ, చిరంజీవి బీజేపీలో చేరితే.? అంటూ రకరకాల విశ్లేషణలు షురూ అవుతున్నాయి. చిరంజీవి రాజ్యసభకు వెళతారు, కేంద్ర మంత్రి అవుతారనేది చాలా విశ్లేషణల్లో కనిపిస్తోన్న విషయం. చిరంజీవి సన్నిహితులు మాత్రం, ఇంకోసారి చిరంజీవి ‘బుదరలో కాలు వెయ్యరు..’ అని రాజకీయాలపై స్పష్టతనిచ్చేస్తున్నారు.