Modi : వచ్చి వెళ్ళిన ప్రధాని మోడీ, తెలంగాణకి ఉపయోగమేంటి.?
Modi : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ వచ్చారు. ఇది పూర్తిగా రాజకీయ పర్యటన. సో, ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ పర్యటన వల్ల హైద్రాబాద్ నగరానికి అదనంగా ఏదో ప్రయోజనం చేకూరుతుందని ఎవరూ ఆశించరు. ఆశించకూడదు కూడా. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి పలు ప్రశ్నల్ని ప్రధాని నరేంద్ర మోడీ ముందుంచింది. నిజానికి, తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ సమాజం నుంచి కూడా నరేంద్ర మోడీ ముందు కొన్ని ప్రశ్నలు వున్నాయి.
వాటికి ప్రధాని నరేంద్ర మోడీ అస్సలు సమాధనమే చెప్పలేదు. డబుల్ ఇంజిన్ సర్కారు.. అని నినదించేసి ఊరుకున్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ ఉవాచ. వస్తే ఏం చేస్తారో మాత్రం చెప్పలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తారా.? విభజన చట్టంలో భాగంగా పేర్కొన్న స్టీలు ప్లాంటు విషయమై ఇప్పటిదాకా ఏం చేశారు.? కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్రటీ మాటేమిటి.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
దేశంలో ఏ రాష్ట్రమూ.. అందునా, దక్షిణాది రాష్ట్రాలు.. అందునా తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని అస్సలేమీ అడగకూడదు. కేంద్రం ఏమీ ఇవ్వదు కూడా. కానీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చెయ్యాలి. ఇదీ నరేంద్ర మోడీ అండ్ టీమ్ చెబుతున్న డబుల్ ఇంజిన్ కాన్సెప్ట్.!
ఉత్తరాది రాజకీయాలకు దక్షిణాది రాజకీయం ఎన్నాళ్ళు బానిసత్వం చేస్తుంది.? అన్న ప్రశ్న ప్రతిసారీ తెరపైకొస్తోంది.! బీజేపీ కార్యవర్గ సమావేశాల తర్వాత ఆ మాట ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది.