Huzurabad Bypoll : హుజురాబాద్ బై ఎలక్షన్స్ పై ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్.. గెలుపు ఆయనదే అంటున్న ఎగ్జిట్ పోల్స్!
Huzurabad Bypoll : హుజురాబాద్ ఉపఎన్నికల్లో మొత్తానికి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. అయితే, హుజురాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీనా? కాషాయ జెండానా? అనేది తెలియాలంటే నవంబర్ 2వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే. ఇకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హుజురాబాద్ ఎన్నికలు జరిగాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఎన్నికలను దేశంలో కాస్ట్లీ ఎన్నికలుగా పొలిటికల్ విశ్లేషకులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఈటల రాజేందర్ మళ్లీ అసెంబ్లీకి రాకుండా చేయాలనేదే అధికార టీఆర్ఎస్‌కు మెయిన్ ఎజెండాగా కనిపించింది. అందుకోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించడం..
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గులాబీ పార్టీకి చెందిన మంత్రులు, లీడర్లు నియోజకవర్గంలో తిరగడం, నిఘా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ఒక్కటేమిటి.. ఏ చిన్న చాన్స్ దొరికినా అన్నింటినీ వాడుకుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఓటుకు రూ.6 వేల చొప్పున టీఆర్ఎస్ పార్టీ సీల్డ్ కవరల్లో డబ్బులు ప్యాక్ చేసి ఓటర్లకు పంపిణీ చేసింది. మొత్తానికి ఈ ఉపఎన్నిక బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కాకుండా.. కేసీఆర్ VS ఈటల రాజేందర్ అన్న విధంగా సాగాయనడంలో అతిశయోక్తి లేదు. కాగా, ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై ఒక్క హుజురాబాద్ ప్రజలకు మాత్రమే క్లారిటీ ఉంది. మిగతా వారు మాత్రం రిజల్ట్స్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
Huzurabad Bypoll : ఈటల వైపే అనుకూల పవనాలు..
ఇప్పటికే హుజురాబాద్ ఎన్నికలపై పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. మ్యాగ్జిమమ్ ఒకటి రెండు మినహా అన్ని సర్వేలు బీజేపీకే అనుకూలంగా చూపించాయి. అందులో భాగంగానే ‘ఆత్మసాక్షి’ సర్వే ఏం చెబుతుందంటే.. బీజేపీ తరఫున పోటీకి దిగిన ఈటల రాజేందర్ 50.5 శాతం ఓట్లతో ముందు వరుసలో నిలిచి విజయం సాధిస్తారని తెలిపింది. టీఆర్ఎస్ 43.1 శాతం ఓట్లతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ రెండవ స్థానం, కాంగ్రెస్ అభ్యర్ధి బల్మూరు వెంకట్ 5.7 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలుస్తారని ప్రకటించింది. ‘పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే’ ప్రకారం.. ఈటల రాజేందర్ స్వల ఆధిక్యంతో గెలుస్తారని చెప్పింది.
ఇదిలాఉండగా, ఓటింగ్ శాతం పెరగడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చినా సరే కొంచెం అటు ఇటు ఫలితాలు రావొచ్చు. కానీ పెరిగిన ఓటింగ్ శాతం చివరి రౌండ్ ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఓటర్లు మనస్సు మార్చుకుంటే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు కూడా చివర్లో ఓటమి పాలయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.