NTR Health University : ఉన్నపళంగా ఎన్టీఆర్ పేరు మార్చడం వెనుక బలమైన కారణం? మరో సంచలనం చేయబోతున్న జగన్?
NTR Health University : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఉన్నపళంగా తీసేసి.. దానికి వైఎస్సార్ పేరును పెట్టి అసెంబ్లీలోనూ ఆ చట్టాన్ని ఆమోదించుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అసలు ఇంత అర్జెంట్ గా ఎన్టీఆర్ పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది. అందరి మనసులోనూ తొలుస్తున్న ప్రశ్న ఇదే. చివరకు కొందరు వైసీపీ నేతలకు కూడా ఇది నచ్చడం లేదట. పార్టీకి ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని జగన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జగన్ మాత్రం ఎవ్వరినీ పట్టించుకోలేదట. అయితే.. జగన్ ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరును ఏదో ఊరికే పెట్టలేదట. పక్కాగా వ్యూహం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఎన్టీఆర్ పేరు మార్చడం వెనుక బలమైన కారణమే ఉందట. యూనివర్సిటీ అధికారుల నిర్వాకం వల్లనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు సీఎం జగన్ ఫోటోనే లేదట. ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి ఫోటో మాత్రం లేదట. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ల ఫోటోను పెట్టడం ఆనవాయితీ. ఇది ప్రోటోకాల్. దాన్ని అధికారులు పాటించాలి. కానీ.. 2019 లోనే ముఖ్యమంత్రి అయిన జగన్ ఫోటోను ఇప్పటి వరకు యూనివర్సిటీలో పెట్టకపోవడంపై కొత్త వివాదం తెరమీదికి వచ్చింది.
NTR Health University : చంద్రబాబు ఫోటోను తొలగించిన అధికారులు జగన్ ఫోటోను ఎందుకు పెట్టలేదు
2019 మే వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అప్పుడు యూనివర్సిటీలో చంద్రబాబు ఫోటోను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఓడిపోయి.. ముఖ్యమంత్రిగా జగన్ అయ్యాక చంద్రబాబు ఫోటోను యూనివర్సిటీ అధికారులు తొలగించారు కానీ.. జగన్ ఫోటోను మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇది కేవలం కులాభిమానం అని.. హెల్త్ యూనివర్సిటీలో చాలా ఏళ్ల నుంచి పని చేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వల్లనే జగన్ ఫోటోను యూనివర్సిటీలో పెట్టలేదనే వార్తలు వస్తున్నాయి. పలు మార్లు యూనివర్సిటీ అధికారులకు ఈ విషయంపై నోటీసులు వెళ్లినప్పటికీ వాళ్లు పట్టించుకోకుండా సీఎం జగన్ ఫోటోను ఏర్పాటు చేయకపోవడం వల్ల సీఎం జగన్ ఏకంగా యూనివర్సిటీ పేరునే మార్చాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పేరు మార్చడం వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిసినా కూడా జగన్.. ముందుకు వెళ్లి దానికి వైఎస్సార్ పేరు పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే.. యూనివర్సిటీలో సుదీర్ఘ కాలం నుంచి పని చేస్తున్న పలువురు సిబ్బందిని కూడా అక్కడి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.