Junior NTR : చంద్రబాబు అంటే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కి ఎందుకంత కోపం?
Junior NTR : చంద్రబాబు నాయుడు అంటేనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మండిపడుతున్నారట. అసలే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇరుక్కున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో నందమూరి కుటుంబం మొత్తం ఆయన్ను చూడటానికి రాజమండ్రి జైలుకు వెళ్లింది. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు.. చంద్రబాబు మీద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు ఎందుకంత కోపం అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది.
అసలు జూనియర్ ఎన్టీఆర్ అయితే నందమూరి కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లోనే పాల్గొనడం లేదు. అసలు సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాల్లోనూ ఆయన జోక్యం చేసుకోవడం లేదు. సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకొని కనీసం ఆయనకు అవమానం జరిగినా కూడా జూనియర్ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినా స్పందించలేదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రాలేదు. చివరకు ఎన్టీఆర్ పేరుతో స్మారక నాణేన్ని విడుదల చేసినా జూనియర్ వెళ్లలేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు.
Junior NTR : చంద్రబాబు రాజకీయాలకు తాను ప్లస్ కాకూడదని భావిస్తున్నారా?
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి సందర్భంలో ఆయన ఏం చేసినా కూడా అది పెద్ద సెన్సేషనే అవుతుంది. నిజానికి 2009 ఎన్నికల్లో టీడీపీకి జూనియర్ సపోర్ట్ చేశారు. చంద్రబాబుకు అండగా ఉన్నారు. చంద్రబాబు తరుపున ప్రచారం కూడా చేశారు. కానీ.. 2009 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి జూనియర్ ను అకారణంగా బాబు గెంటేశారు. తన కొడుకు లోకేష్ కోసం జూనియర్ ను దూరం పెడుతూ వచ్చారు చంద్రబాబు. అదే చంద్రబాబుకు మైనస్ అయింది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ విషయాల్లో కానీ, చంద్రబాబు విషయాల్లో కానీ జోక్యం చేసుకోవడం లేదు. హరికృష్ణ చనిపోయిన తర్వాత ఆ దూరం ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు.