నన్ను పోలీసులు చితకబాదారు.. అంటూ గాయాలు చూపిస్తూ న్యాయమూర్తికి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇష్యూ చిలికి చిలికి గాలివానలా తయారవుతోంది. ఏపీలో ప్రస్తుతం ఈయన గురించే చర్చ. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారని పలు కేసుల ఆయన మీద వేసి.. సీఐడీ పోలీసులు.. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేయం మొదలు.. ఆ తర్వాత రాత్రంతా ఒక్క నిమిషం కూడా ఆయన్ను నిద్రపోనీయకుండా.. పోలీసులు విచారణ చేశారట. విచారణ పేరుతో పోలీసులు తనను తీవ్రంగా కొట్టారంటూ సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన తర్వాత న్యాయమూర్తికి రఘురామ ఫిర్యాదు చేశారు.
విచారణ సమయంలో పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించి.. తనపై చేయి చేసుకున్నారని.. తనను తీవ్రంగా కొట్టారని.. తన కాళ్లకు ఉన్న గాయాలే దానికి సాక్ష్యం అని చెబుతూ.. న్యాయమూర్తికి లిఖిత పూర్వకంగా రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. సీఐడీ ఆఫీసు నుంచి కోర్టుకు తీసుకురావడానికి ముదు.. గుంటూరులో మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. సీఐడీ కార్యాలయంలోనే రఘురామకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
కోర్టుకు వెళ్లకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు
ఇదిలా ఉండగా… రఘురామ కృష్ణంరాజు తరుపు లాయర్లు.. పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కోర్టుకు వెళ్లకుండా తమను అడ్డుకుంటున్నారని తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా? అంటూ లాయర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే.. అంతకుముందే రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో ఆయకు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పేసింది. బెయిల్ కోసం డైరెక్ట్ గా హైకోర్టుకు రావడం ఏంటంటూ మండిపడింది. ముందు సెషన్స్ కోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.