Ys Jagan : ఇల్లు, ఆఫీస్… తాడేపల్లి వయా అమరావతి.. ఇంతేనా జగనన్న…!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి రోజులో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న కానీ లాభం లేకుండా పోతుంది. సీఎం హోదా లో జగన్ మోహన్ రెడ్డి ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన కానీ క్షేత్ర స్థాయిలో దాని ఫలితాలు మాత్రం కనిపించటం లేదు. మొన్నటికి మొన్న తమిళనాడు, కర్ణాటక నుండి వచ్చే ఆక్సిజన్ సరఫరాను పరివేక్షించటానికి ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని చెప్పారు. తీరా నిన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సకాలంలో అందక 11 మంది చనిపోయారు. మరి దీనికి బాధ్యత ఎవరు..?
2019 కి ముందు పాదయాత్ర అంటూ ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు .. అప్పుడే తెలిసింది మీ పట్టుదల ఏమిటో.. దాని ఫలితమే ఇప్పుడు సీఎం కుర్చీ. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న కానీ ఇంత వరకు కాలు బయటపెట్టిన పాపాన పోలేదు. ఇల్లు, ఆఫీస్… తాడేపల్లి వయా అమరావతి అన్నట్లు తప్పితే ప్రజల్లోకి రాలేదు. కానీ ఇప్పుడు దేశం, రాష్ట్రం ఘోర విపత్తులో వున్నాయి. జనం చచ్చిపోతున్నారు. మీరు నిమ్మకు నీరెత్తినట్లు అమరావతిలో కూర్చుని ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో చూడడం లేదు. మీరు ఏం చేస్తున్నారు.
Ys Jagan : అధికారులను పిలిచి సమీక్షలు
అలాగని మీరేమి సైలెంట్ గా కూర్చోలేదు. టాప్ లెవెల్ అధికారులను పిలిచి సమీక్షలు నిర్వహించి ఎవరెవరు ఏమేమి బాధ్యతలు నిర్వర్తించాలో వివరించి పంపిస్తున్నారు. కానీ ఫలితం అనుకున్న స్థాయిలో రావటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల జాడ అక్కడక్కడ కనిపిస్తోంది. ఆసుపత్రుల్లోకి, కోవిడ్ సెంటర్లలోకి మీరు ఒక్కసారైనా అడుగుపెడితే అక్కడ నిర్వాహకులకు భయం వుంటుంది. పెట్టే ఫుడ్ లో నాణ్యత వుంటుంది. చేసే చికిత్సలో, సదుపాయాల్లో అన్నింటిలో తేడా వుంటుంది. ఎవ్వరూ రారు, ఎవ్వరూ చూడరు అన్నపుడు ఏం భయం వుంటుంది?
కరోనా విచ్చలవిడిగా ఉంటున్న ఈ సమయంలో సీఎం ఆసుపత్రులు తిరిగి ఆయనకూడా కరోనా బారిన పడాలని ఎవరు అనుకోరు.. సాధ్యమైన చోట్లకు, హెలిప్యాట్స్ అందుబాటులో ఉన్న పట్టణాలకు వెళ్లి సీఎం హోదా లో పరిశీలించి వస్తే దాని ఇన్ఫెక్ట్ రాష్ట్రము మొత్తం మీద పడుతుంది. సీఎం ఆలా తిరిగితే మిగిలిన మంత్రులు తమ తమ ప్రాంతాల్లో అలర్ట్ అవుతారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిలు ఒక మార్గానికి వస్తాయి.. ఇప్పటికైనా కాలు బయటపెట్టి సీఎం బయటకు వస్తాడని ఆశిద్దాం..