YS Jagan : వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి భారీ షాక్ ఇవ్వబోతున్న వైఎస్ జగన్?
వైసీపీకి ఈసారి పాతిక ఎంపీ సీట్లు వస్తాయన్న మాట సొంత పార్టీలో వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో గెలుచుకున్న 22 సీట్లతో పాటు టీడీపీ సీట్లు మూడింటినీ కూడా గెలుచుకోవడానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఏపీలో టీడీపీని తుడిచిపెట్టేస్తామని కూడా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడూ ఫెయిల్ అయ్యారు. విపక్షంలోకి వచ్చాక కూడా ఇంకా దారుణంగా విఫలమయ్యారని వైసీపీ అంచనా వేస్తోంది. వైసీపీ పాలన సగానికి వచ్చినా కూడా ఎక్కడా ప్రజా వ్యతిరేకత లేదని వారు గుర్తుచేస్తున్నారు.
ఇదే తీరున వైఎస్ జగన్ దూకుడుగా ముందుకు సాగుతారని, వచ్చే ఎన్నికలు టీడీపీకి కీలకం కాబట్టి ఆ పార్టీని ఏపీ రాజకీయ తెర మీద నుంచి లేకుండా చేయడమే వైసీపీ టార్గెట్ అంటున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికతో పాటు ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద తాడిపత్రి మినహా ఎక్కడా టీడీపీ గెలవలేదు. ఇదే తమ ప్రభుత్వంపై చిన్న వ్యతిరేకత కూడా లేదని చెప్పేందుకు నిదర్శనం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపీలో పాతిక ఎంపీ సీట్లు ఎందుకు గెలుస్తామో కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదన్నది వీరి అంచనా. మోడీ పట్ల గతంలో ఉన్న మోజు జనాలలో బాగా తగ్గిందని, అందువల్ల ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు వస్తే గొప్ప అని వీరు అంటున్నారు.
టీడీపీ బలహీనమవడమే.. Ys jagan
మరోవైపు టీడీపీ కూడా బలహీనం అయిందని, అందుకే తమకు పాతిక సీట్లు కీలకం అవుతాయని వైసీపీ నేతలు అంటున్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చి ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను తెచ్చుకోవడం పైనే వైఎస్. జగన్ దృష్టి సారిస్తారన్నది వైసీపీ నేతల మాటగా ఉంది. ఇక ఏపీలో రాజకీయ పరిస్థితి మీద బీజేపీ కూడా అంతర్గతంగా సర్వే జరిపించుకుందని టాక్ వినిపిస్తోంది. ఏపీలో టీడీపీ పరిస్థితి క్షేత్ర స్థాయిలో దారుణంగా ఉందని, అదే సమయంలో వైసీపీ బలంగా ఉందని బీజపీ కేంద్ర పెద్దలకు నివేదికలు అందాయని సమాచారం. అందుకే వారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్ తో సావాసం చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
వైఎస్.జగన్ లో విశ్వసనీయత ఎక్కువని, మాట ఇస్తే వెనక్కు పోరని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. అన్నింటికీ మించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ యాంటీ కాంగ్రెస్ అన్నదే బీజేపీకి బాగా నచ్చిన అంశంగా చెబుతున్నారు. దీనివల్ల తమకు సీట్లు తగ్గినా, వైఎస్. జగన్ భరోసాగా ఉంటారని బీజేపీ భావిస్తోంది. అందుకే ఇటీవల అనేక అంశాల్లో వైఎస్. జగన్ పట్ల చూసీ చూడని ధోరణితో కేంద్రం ఉంటోందని, మరోవైపు సీఎం జగన్ కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ హవా ఖాయమన్నది అటు ఆ పార్టీ నేతలే కాక, కేంద్ర పెద్దలు సైతం నమ్ముతున్నారు..