YS Sharmila : కొనసాగుతున్న షర్మిల దీక్ష.. అప్పుడే ముగింపు?
YS Sharmila : తెలంగాణలో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ వైఎస్ షర్మిల గత రెండు రోజుల నుంచి ఉద్యోగ దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్ష ఇవాళ కూడా కొనసాగనుంది. 72 గంటల పాటు తాను దీక్ష చేపడతానని షర్మిల ముందు మాట ఇచ్చిన ప్రకారమే లోటస్ పాండ్ లో తన దీక్షను కొనసాగిస్తున్నారు. మొదటి రోజు ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిలను దీక్ష చేయనీయకుండా… పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఒక్క రోజుకు మాత్రమే పర్మిషన్ ఉందని… సాయంత్రం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో షర్మిల సాయంత్రం ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర ప్రారంభించారు.
తన మద్దతు దారులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిలకు అడుగడుగునా పోలీసులు అడ్డుతగిలారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కగానే షర్మిల మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి… షర్మిల కింద పడిపోయారు. దీంతో షర్మిల జాకెట్ చినిగిపోయింది. చేతికి గాయం అయింది. వెంటనే పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడి నుంచి లోటస్ పాండ్ కు తరలించారు.
YS Sharmila : ఆదివారం ఉదయం 11 గంటల వరకు కొనసాగనున్న షర్మిల దీక్ష
లోటస్ పాండ్ లోనే షర్మిల మళ్లీ తన దీక్షను కొనసాగించారు. షర్మిల దీక్షకు పలు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మద్దతు పలికారు. శనివారం కూడా తన దీక్ష కొనసాగుతోంది. పోలీసుల తోపులాటలో షర్మిల చేతికి గాయం కావడంతో… ఆ గాయంతోనే తను దీక్ష చేస్తున్నారు. అయితే… మూడు రోజుల నుంచి తను ఏం తినకుండా నిరాహార దీక్ష చేస్తుండటంతో తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని.. ఏవైనా ఫ్లూయిడ్స్ అయినా తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కానీ.. షర్మిల మాత్రం అందుకు నిరాకరించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు షర్మిల తన దీక్షను విరిమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.