BRS MLAs : కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అబ్బె.. ఉత్తిదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BRS MLAs : కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అబ్బె.. ఉత్తిదే..!

BRS MLAs : తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో భారత రాష్ట్ర సమితి పార్టీలో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆయనకు పుష్పగుచ్చం సమర్పించుకొని, ఆయనతో కలిసి ఫోటోలు దిగటం, భేటీ కావడం, చర్చ సాగించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తాము తమ తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  BRS MLAs : కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అబ్బె.. ఉత్తిదే..!

BRS MLAs : తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో భారత రాష్ట్ర సమితి పార్టీలో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆయనకు పుష్పగుచ్చం సమర్పించుకొని, ఆయనతో కలిసి ఫోటోలు దిగటం, భేటీ కావడం, చర్చ సాగించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తాము తమ తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించడానికి మాత్రమే ముఖ్యమంత్రిని కలిశామని, అంతకుమించి తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అంటున్నారు. అలాంటి మాటల ద్వారా తాము కాంగ్రెస్ లోకి ఫిరాయించడం లేదని సంకేతాలను పంపడానికి ప్రయత్నిస్తున్నారు.అయినా తాడి చెట్టు కింద నిల్చుని పాలు తాగిన కళ్ళు తాగినట్టే అని సమాజం భావిస్తుంది. ఈ సంగతి సామాన్యులైన మన తోటి వారి కంటే రాజకీయాల్లో ఉన్న వారికి ఇంకా బాగా తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జోలికి ఇంకా వెళ్లకుండా కిందిస్థాయిలో కార్యకర్తలని అందరిని ఆ పార్టీలోంచి ఖాళీ చేసేస్తూ మున్సిపాలిటీలను జిల్లా పరిషత్తులను తమ వశం చేసుకుంటూ కాంగ్రెస్ రాజకీయం నడిపిస్తోంది.

ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని గులాబీ విమర్శలకు కౌంటర్ గా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతారని సాక్షాత్తు మంత్రులే చెబుతున్న తరుణంలో నలుగురు భారాస ఎమ్మెల్యేలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం ఫిరాయింపుకు తొలిమెట్టుగానే ప్రజలు భావిస్తారు.సునీత లక్ష్మారెడ్డి ( నర్సాపూర్ ) , మహిపాల్ రెడ్డి ( పటాన్ చెరువు) , కొత్త ప్రభాకర్ రెడ్డి ( దుబ్బాక ) మాణిక్ రావు ( జహీరాబాద్) లు సీఎంను కలిశారు. అయితే ఈ నలుగురు భేటీ అయి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ కంగారు పడింది. వారితో మాట్లాడింది. సునీత లక్ష్మారెడ్డి మాత్రం తన నియోజకవర్గ డెవలప్మెంట్ అనే పదంతో పాటు ఎమ్మెల్యే భద్రత గురించి మాట్లాడాను అన్నారు. ఇక మహిపాల్ రెడ్డి కాస్త క్రియేటివిటీ ప్రదర్శించి ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాము కూడా సీఎంను అలాగే కలిసామని అన్నారు. మిగిలిన ఇద్దరు కూడా ఇంచుమించు అలాంటి ప్రకటనలే చేశారు.

అయితే బీఆర్ఎస్ లో మాత్రం కంగారు ఇంకా తగ్గలేదు.బుధవారం నాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. తాము భేటి కావడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టుగా పార్టీ ప్రకటించింది. ఈ ప్రెస్ మీట్ లో కేవలం దుష్ప్రచారాన్ని ఖండించడం మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఈ నలుగురు ఎలా విరుచుకుపడతారు అనేదాన్ని బట్టి వారు ఫిరాయిస్తున్నారా లేదా అనేది అర్ధమైపోతుంది అంటున్నారు. అయినా ఇలాంటి కలయికలకు అర్థాలు వేరేలా ఉంటాయి. వీరు నుంచి సిగ్నల్ వెళ్ళిపోయింది. అటునుంచి రేవంత్ పచ్చజెండా ఎప్పుడూ ఊపుతారు అనేదాన్ని బట్టి, అప్పటిదాకా వారు గులాబీ ప్రేమనే ఒలక పోస్తూ ఈ గట్టున ఉంటారని అటు నుంచి సిగ్నల్ రాగానే జంప్ చేస్తారని ప్రజలు భావిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది