Nagababu : రాజ్యసభ నామినేట్ విషయంలో స్పందించిన నాగబాబు
ప్రధానాంశాలు:
Nagababu : రాజ్యసభ నామినేట్ విషయంలో స్పందించిన నాగబాబు
Nagababu : వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ముగ్గురు రిజైన్ చేయడంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ మూడు సీట్లలో ముగ్గురికి అవకాశం దక్కడం ఖాయం. కానీ ఆ ముగ్గురు ఎవరన్నదే డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఫ్యాన్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామా చేయడంతో మూడు సీట్లకు బైపోల్ వచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం ఉన్న కూటమి ఈ మూడు రాజ్యసభ సీట్లను దక్కించుకోవడం పక్కా. అయితే కూటమిలో మూడు పార్టీలు ఉండటం.. మూడు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉండటంతో సీనియర్ నేతలు రాజ్యసభ స్థానం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు.
Nagababu నా జీవితానే ఇస్తా..
మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు..చివరి నిమిషంలో టికెట్ వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వంటి నేతలు రాజ్యసభ రేసులో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి కూడా పెద్దల సభకు వెళ్లాలని ఆశ పడుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, కంభంపాటి రామ్మోహన్ రావు తాము పార్టీకి చేసిన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 3వ తేదీన వెలువడుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి గడువు అదే నెల 10వ తేదీ. 20న ఎన్నికలు ఉంటాయి.
అయితే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు స్వయానా సోదరుడు, పార్టీ అధికార ప్రతినిధి నాగబాబు నామినేట్ అవుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవలే తన హస్తిన పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ స్వయంగా బీజేపీ నేతల ముందు ఈ ప్రతిపాదన ఉంచారంటూ వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా నాగబాబు స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనంటూ పరోక్షంగా తేల్చి చెప్పారు. రాజకీయంగా ఎలాంటి పదవుల గురించీ తాను ఆలోచించట్లేదని , తమ నాయకుడు పవన్ కల్యాణేనని, ఆయన సారథ్యంలో నిస్వార్థంగా పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ స్వార్థం తెలియని ప్రజానాయకుడు. ఆయన చేసే ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. ఆయన ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడని, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు, పోరాడతాడని నాగబాబు తేల్చి చెప్పారు.