Komatireddy Rajagopal Reddy : బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి
ప్రధానాంశాలు:
తిరిగి సొంత గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఢిల్లీలో రాహుల్, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
Komatireddy Rajagopal Reddy : అనుకున్నదే జరిగింది. చాలా రోజుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ రాజీనామా చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో, ఇతర కాంగ్రెస్ పార్టీల నేతలతో చర్చలు సఫలం కావడంతో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్నేళ్లకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ ఉపఎన్నిక రావడంతో బీజేపీ నుంచి అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినా.. గెలవలేకపోయారు. అయినా బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నుంచి తనకు ఎల్బీ నగర్ టికెట్ కావాలని ఆశించినట్టు తెలుస్తోంది. మునుగోడు, ఎల్బీనగర్ రెండు నియోజకవర్గాల నుంచి టికెట్ కావాలని హైకమాండ్ ను కోమటిరెడ్డి కోరినట్టు తెలుస్తోంది.
కానీ.. బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో సొంత గూటికి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని ప్రజలు భావిస్తున్నారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీకి రాజీనామా చేసి ఎల్లుండి ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. తాను బీజేపీకి రాజీనామా చేశానని.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని అధికారిక ప్రకటనను కోమటిరెడ్డి తాజాగా విడుదల చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనేదే నా ఆశయం. అది మరో ఐదు వారాల్లో నెరవేరబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అది తెలిసిపోతోంది.. అంటూ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

komatireddy rajagopal reddy resigns to bjp party and to join in congress
ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉందని భావిస్తున్నాను. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడానికి నిర్ణయించుకున్నా అని తను విడుదల చేసిన ప్రకటనలో కోమటిరెడ్డి స్పష్టం చేశారు.