Telangana Assembly Updates : మూడు నెలల్లో మీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అన్న కేటీఆర్.. కేసీఆర్ ను ఎంపీని చేసిందే కాంగ్రెస్ అన్న రేవంత్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Telangana Assembly Updates : మూడు నెలల్లో మీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అన్న కేటీఆర్.. కేసీఆర్ ను ఎంపీని చేసిందే కాంగ్రెస్ అన్న రేవంత్  

Telangana Assembly Updates : తెలంగాణ అసెంబ్లీలో చర్చ వాడీవేడీగా సాగుతోంది. నిన్న గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించగా.. ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. 2014 కు ముందు తెలంగాణ ఎలా ఉండేది. ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండేది. ఆకలి కేకలు, ఆత్మహత్యలు అంటూ కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ సత్యదూరమే అని కేటీఆర్ ఆన్నారు. అయితే.. 2014 కు ముందు జరిగిన దాని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 December 2023,3:28 pm

ప్రధానాంశాలు:

  •  కేటీఆర్ కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

  •  55 ఏళ్ల పాలన గురించి తర్వాత ముందు మీ 10 ఏళ్ల పాలన సంగతి ఏంటి?

  •  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారన్న భట్టి

Telangana Assembly Updates : తెలంగాణ అసెంబ్లీలో చర్చ వాడీవేడీగా సాగుతోంది. నిన్న గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించగా.. ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. 2014 కు ముందు తెలంగాణ ఎలా ఉండేది. ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండేది. ఆకలి కేకలు, ఆత్మహత్యలు అంటూ కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ సత్యదూరమే అని కేటీఆర్ ఆన్నారు. అయితే.. 2014 కు ముందు జరిగిన దాని గురించి ఎందుకు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యల వల్లనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

బరాబర్ కాంగ్రెస్ పార్టీ దురాగతాలు చెబుతాం. పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కటిక చీకట్లు, నెత్తులు గారిన నేలలు ఇవే కదా అప్పుడు మీరు చూపెట్టిన అద్భుతాలు. సాగు నీటికి, తాగునీటికి దిక్కులేదు అని కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాతబస్తీలో మైనారిటీ తీరని బాలికల అమ్మకాలు, మహబూబ్ నగర్ లో వలసలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ప్రతి రోజు రెండు బస్సులు ముంబైకి వెళ్లేవి. ఎన్ని ఎకరాలు ఉన్న రైతు అయినా సరే.. హైదరాబాద్ కు వచ్చి కూలి చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

మధ్యలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలుగజేసుకొని అధ్యక్ష ప్రభుత్వం మారింది. మేము ప్రభుత్వం తరుపున చాలా స్పష్టంగా చెప్పాం. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం. ఉన్న విషయాలపై లుగా చర్చిద్దాం. నిర్ణయాత్మకమైన సూచనలు మీరు ఏం ఇచ్చానా తీసుకుందాం. ప్రభుత్వం చెప్పిన మాటలను స్వాగతిస్తున్నాం అనో లేక ముందుకు వెళ్దామనో కాదు.. మొదలు పెట్టడమే ఒక దాడిలా చేస్తున్నారు అంటూ డిప్యూటీ సీఎం.. కేటీఆర్ పై మండిపడ్డారు. మీరు 10 ఏళ్లు పాలన చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చారు. దానితో ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. దానిపై వినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు భట్టి.

ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలో పదేళ్ల విధ్వంసం అన్నారు. పదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడినప్పుడు.. 55 ఏళ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాలి కదా. 55 ఏళ్ల పాలనలో తాగునీరు ఇవ్వలేని అసమర్థులు అనగానే అంత ఉలిక్కిపడుతున్నారు. మొదటి రోజే ఒక్కో మంత్రి లేచి ఉలిక్కి పడి మాట్లాడుతున్నారు. నిర్మాణాత్మక సూచనలు చేయమన్నారు.. మేము స్వాగతిస్తాం. కానీ.. గవర్నర్ ప్రసంగం నిర్మాణాత్మకంగా లేదు. మా అధ్యక్షులు కేసీఆర్ ఒకటే మాట చెప్పారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇద్దాం. మూడు నెలల్లో అట్టర్ ప్లాఫ్ అవుతుంది అన్నారు. కానీ.. మూడు నెలలు సమయం ఇద్దాం అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో వాళ్లు చేసిందేముంది బొంబాయి.. బొగ్గుబాయి.. దుబాయి. ఇదే కదా అప్పుడు జరిగింది. సీఎం సొంత జిల్లాలోనే గంజి కేంద్రాలు, ఆకలి చావులు, ఎన్ కౌంటర్లు తప్పితే ఇంకేం ఉన్నాయి అధ్యక్ష అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

ప్రాజెక్టులు కట్టకున్నా.. పైసలు తరలించుకుపోయినా మౌనంగా హారతులు పట్టింది కాంగ్రెస్ నాయకులు. ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది వీళ్లు అన్నారు. మాకు కూడా 39 మంది సభ్యులు ఉన్నారు అని చెప్పుకొచ్చారు కేటీఆర్. దీంతో అసెంబ్లీలో కాసేపు గొడవ జరిగింది.

55 ఏళ్లలో మీరు ఏం చేశారు.. అని అంటున్నారు. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో పాలన కంటే ఇంకా బాగా చేసుకోవచ్చు అనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మనం రిలేటివ్ గా ఏం తీసుకుంటాం అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తర్వాత, సంపదతో కూడిన రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ తో కూడిన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత మీది అని భట్టి మండిపడ్డారు.

ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం కాదు. మనం ప్రయత్నం చేసినా వాళ్లు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా వాల్యూ ఉంటుంది. 51 కి వంద శాతం వాల్యూ ఉంటుంది. 51 శాతం నెంబర్ ఉన్నవాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49 శాతం ఉన్నవాళ్లు ప్రతిపక్షంలో ఉంటారు. వాళ్లు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారు. ఆ స్పిరిట్ ను తీసుకొని ముందుకెళ్లాలి కానీ.. వాళ్లు 64 మంది ఉన్నారు.. మేము 39 మంది ఉన్నాం.. ఇవన్నీ ఎందుకు అధ్యక్ష. ఈ సభను నడిపించుకోవడానికి ఈ భాష సహకరించదు.

గత పాలన గురించి, గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారు. నా రిప్లయి కోసం తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెడిసెంట్ గా కేసీఆర్ కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ నుంచి నిలబడి ఓడిపోయిందే కేసీఆర్. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ, కార్మిక మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పోతిరెడ్డిపాడు కోసం ఆనాడు కొట్లాడింది పీజేఆర్. కృష్ణా నది జలాల్లో మా వాటా మాకు ఉండాలని కొట్లాడింది పీ జనార్థన్ రెడ్డి తప్పితే వీళ్లు కాదు. ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు.. ఇప్పటి ఎమ్మెల్యే కేటీఆర్ ఎలా ఎమ్మెల్యే అయ్యారు. వీళ్ల తండ్రి గారి గురువు చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని కేకే మహేందర్ రెడ్డి నిర్మించుకున్న కోటను బద్ధలు కొట్టి ఈరోజు ఇక్కడికి వచ్చారు. గతం గురించి వాళ్లకు చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం సమయం ఇవ్వండి. 55 ఏళ్ల పాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాం అని సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ రిప్లయి ఇచ్చారు.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక