Major Movie Review : మేజర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Major Movie Review : మేజర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

Major Movie Review : మేజర్.. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఉద్వేగం ఉంది. ఒక దేశ చరిత్ర ఉంది. ఇది మామూలు సినిమా కాదు. టైమ్ పాస్ సినిమా అంతకన్నా కాదు. ఒక వీరోచితుడి ప్రయాణమే ఈ సినిమా. రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథే మేజర్. ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో తాజ్ హోటల్ లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి.. వాళ్లను మట్టుబెట్టి.. ప్రజల ప్రాణాలు కాపాడి.. తన ప్రాణాలను అర్పించిన […]

 Authored By gatla | The Telugu News | Updated on :2 June 2022,11:58 pm

Major Movie Review : మేజర్.. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఉద్వేగం ఉంది. ఒక దేశ చరిత్ర ఉంది. ఇది మామూలు సినిమా కాదు. టైమ్ పాస్ సినిమా అంతకన్నా కాదు. ఒక వీరోచితుడి ప్రయాణమే ఈ సినిమా. రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథే మేజర్. ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో తాజ్ హోటల్ లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి.. వాళ్లను మట్టుబెట్టి.. ప్రజల ప్రాణాలు కాపాడి.. తన ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తి సందీప్. ఈ సినిమాలో సందీప్ పాత్రను ప్రముఖ నటుడు అడవి శేష్ పోషించాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి ప్రముఖ స్టార్ హీరో మహేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.

Major Movie Review : ప్రత్యేకంగా తాజ్ హోటల్ సెట్

Major Movie Review And Live Updates

Major Movie Review And Live Updates

ఈ సినిమా కోసమే ముంబైలోని తాజ్ హోటల్ ను పోలిన సెట్ ను మూవీ యూనిట్ వేసింది. ఆ సెట్ తో పాటు మొత్తం 8 సెట్లను వేసి సినిమాను పూర్తి చేశారు. అడవి శేష్ నటించిన గుఢచారి సినిమా దర్శకుడు శశి కిరణ్ తిక్కానే ఈ సినిమాకు కూడా డైరెక్టర్. నిజానికి.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కానీ.. కరోనా కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ను దేశ వ్యాప్తంగా కొన్ని రోజుల కిందనే ప్రదర్శించారు. యూఎస్ లో కూడా ప్రీమియర్స్ కూడా వేశారు. మరి.. సినిమా ఎలా ఉందో తెలుకోవాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

ఇది కూడా చ‌ద‌వండి

Vikram Movie Review : ‘విక్రమ్‘ ఫస్ట్ రివ్యూ ఇదిగో.. రెస్పాన్స్ సూపర్.. బ్లాక్‌బస్టరే..!

Major Live Updates : మేజర్ మూవీ లైవ్ అప్ డేట్స్
Major Live Updates : సినిమా పేరు : మేజర్
నటీనటులు : అడవి శేష్, శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, మురళి శర్మ, రేవతి తదితరులు
నిర్మాత : మహేశ్ బాబు
డైరెక్టర్ : శశి కిరణ్ తిక్క
విడుదల తేదీ : 3 జూన్ 2022

Major Movie Review : కథ

సందీప్ ఉన్నికృష్ణన్(అడవి శేష్) ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన యువకుడు. అంటే మధ్యతరగతి యువకుడు. తన తండ్రి అతడిని డాక్టర్ ను చేయాలనుకుంటాడు. కానీ… తన తల్లి మాత్రం అతడిని ఇంజనీర్ చేయాలనుకుంటుంది. సందీప్ కు మాత్రం నేవీలో చేరాలనేది లక్ష్యం. అందుకని నేవీ కోసం ట్రై చేస్తుంటాడు. ఒకసారి నేవీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు సందీప్. అదే సమయంలో తనకు ఆర్మీలో చేరే అవకాశం లభిస్తుంది. అప్పుడే తనకు ఇషా(సయా మంజ్రేకర్) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. మరోవైపు సందీప్ ఆర్మీలో మంచి పొజిషన్ కు చేరుకుంటారు. ఆ తర్వాత ముంబైలో ఉగ్రదాడి జరుగుతుండటంతో అక్కడికి అతడిని పంపిస్తారు. తాజ్ హోటల్ లో జరుగుతున్న ఉగ్రదాడిని ఎదుర్కునేందుకు మేజర్ సందీప్ ను పంపిస్తారు. ఆ సమయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తాజ్ హోటల్ లో ఉగ్రవాదులను సందీప్ ఎలా మట్టికరిపించాడు? మరోవైపు సందీప్ కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాను థియేటర్ లో చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమాను మరే ఇతర సినిమాలతో పోల్చలేం. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇది ఒక బయోపిక్. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సందీప్ అనే ఆర్మీ అధికారి జీవితానికి సంబంధించిన కథ. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ సందీప్ లా కనిపించేందుకు అడవి శేష్ చాలా కష్టపడ్డాడు. కాలేజీ డేస్ లో, ఆ తర్వాత యంగ్ ఏజ్ లో ఆ తర్వాత మేజర్ గా మూడు షేడ్స్ లో అడవి శేష్ అదరగొట్టాడు. సందీప్ తల్లిదండ్రులుగా ప్రకాశ్ రాజ్, రేవతి అద్భుతంగా నటించారు. ఆర్మీ ఆఫీసర్ గా మురళీ శర్మ.. అతిథి పాత్రలో శోభిత దూళిపాళ్ల నటించారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం సందీప్ బాల్యం, చదువు, పెళ్లి, ఉద్యోగ అన్వేషణ అనే విషయాల మీదనే గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్ మొత్తం ఉగ్రవాదులకు, ఎన్ ఎస్జీ కమండోలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఉగ్రవాదులను మట్టుపెట్టి హోటల్ లో ఉన్న ప్రజలను కాపాడేందుకు సందీప్ ఎంత కష్టపడ్డాడో… చివరకు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి.. ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రజలను కాపాడే తీరును ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలాగే.. మరోవైపు సందీప్ తల్లిదండ్రులు, అతడి భార్య.. తనకు ఏమౌతుందో అని పడే టెన్షన్ ను కూడా దర్శకుడు ఈ సినిమాలో బాగా చూపించాడు. అందుకే.. ఈ సినిమాలో లోపాలు వెతక్కుండా.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుడి చరిత్రను తెలుసుకోవాలంటే ప్రతి భారతీయుడు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది