ENG vs PAK T20 World Cup 2026 : పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన హ్యారీ బ్రూక్.. ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ!

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 February 2026,11:30 pm

ENG vs PAK T20 World Cup 2026 శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 T20 World Cup 2026 సూపర్-8 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ అదరగొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన 45వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి దర్జాగా సెమీ-ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. ఒక దశలో పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ హ్యారీ బ్రూక్ Harry Brook తన అద్భుతమైన సెంచరీతో ఆదుకుని ఒంటిచేత్తో గెలిపించాడు.

ENG vs PAK T20 World Cup 2026 : పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన హ్యారీ బ్రూక్.. ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ!

ENG vs PAK T20 World Cup 2026 : పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన హ్యారీ బ్రూక్.. ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ!

ENG vs PAK T20 World Cup 2026 నిరాశపరిచిన పాక్ బ్యాటింగ్.. ఆదుకున్న ఫర్హాన్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (63 పరుగులు, 45 బంతులు) హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 25, ఫఖర్ జమాన్ 25 పరుగులతో పర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ లియామ్ డాసన్ 3 వికెట్లు (3/24) పడగొట్టగా.. జామి ఓవర్టన్ (2/26), జోఫ్రా ఆర్చర్ (2/32) చెరో రెండు వికెట్లు తీసి పాక్‌ను సమర్థవంతంగా కట్టడి చేశారు.

ENG vs PAK T20 World Cup 2026 ఆరంభంలోనే షాక్.. షహీన్ ఆఫ్రిది విజృంభణ

165 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది తన తొలి బంతికే ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత తన తర్వాతి ఓవర్లో డేంజరస్ బ్యాటర్ జోస్ బట్లర్ (2)ను కూడా అవుట్ చేశాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 53/3 తో కష్టాల్లో పడింది. ఒక దశలో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. షహీన్ ఆఫ్రిది తన 4 ఓవర్ల స్పెల్‌లో 30 పరుగులిచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు.

వీరవిహారం చేసిన హ్యారీ బ్రూక్

జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మైదానం నలువైపులా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 51 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో అద్భుతమైన సెంచరీ (100) నమోదు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతనికి సామ్ కర్రన్ (16), విల్ జాక్స్ (28) చక్కటి సహకారం అందించారు. విజయానికి కేవలం 10 పరుగుల దూరంలో బ్రూక్ అవుట్ అయినప్పటికీ, అప్పటికే మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ చేతుల్లోకి వచ్చేసింది.

చివరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ

చివరి ఓవర్లలో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వరుస వికెట్లు (విల్ జాక్స్, జామి ఓవర్టన్) తీసి మ్యాచ్‌ను కాస్త ఉత్కంఠగా మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం అవ్వగా, క్రీజులో ఉన్న జోఫ్రా ఆర్చర్ (5 నాటౌట్) తొలి బంతికే బౌండరీ బాది ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసిన ఇంగ్లాండ్, టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.

పాకిస్థాన్‌కు కష్టమే!

సూపర్-8 లో శ్రీలంక, పాకిస్థాన్ లపై వరుసగా రెండు విజయాలు సాధించిన ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు, తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో.. పాకిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదంలో పడ్డాయి. తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై వాళ్లు భారీ విజయంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి