FIFA 2026 : మెస్సి, రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్‌కప్‌నా? ఫుట్‌బాల్ దిగ్గజాల వీడ్కోలు సమయం వచ్చేసిందా!
ప్రధానాంశాలు:
FIFA 2026 : మెస్సి, రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్‌కప్‌నా? ఫుట్‌బాల్ దిగ్గజాల వీడ్కోలు సమయం వచ్చేసిందా!
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణతో పోలిస్తే ఫుట్‌బాల్ అభిమానులు తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలైన లియోనల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డోలకు మాత్రం లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరి మ్యాచ్‌లు అంటే అభిమానులు ప్రత్యేకంగా టీవీల ముందు కూర్చొని చూస్తుంటారు.ఇప్పుడు ఫుట్‌బాల్ అభిమానులందరి దృష్టి FIFA World Cup 2026పై ఉంది. అయితే ఈ టోర్నీ కేవలం మరో ప్రపంచకప్ మాత్రమే కాదు. గత రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించిన కొంతమంది దిగ్గజాలకు ఇది చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెస్సి, రొనాల్డో వంటి లెజెండరీ ఆటగాళ్లు చివరిసారి ప్రపంచకప్ వేదికపై కనిపించే అవకాశం ఉండటంతో అభిమానుల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
FIFA 2026 : మెస్సి, రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్‌కప్‌నా? ఫుట్‌బాల్ దిగ్గజాల వీడ్కోలు సమయం వచ్చేసిందా!
FIFA 2026 మెస్సి కెరీర్‌కు మరో గొప్ప అధ్యాయం
అర్జెంటీనా జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన లియోనల్ మెస్సి ఇప్పటికే ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఎన్నో వ్యక్తిగత రికార్డులు, క్లబ్ విజయాలు సాధించిన మెస్సి కెరీర్‌లో ప్రపంచకప్ మాత్రమే కొంతకాలం అందని కలగా మిగిలింది.అయితే 2022లో ఖతార్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలబెట్టి ఆ కలను నిజం చేసుకున్నాడు. ఆ విజయంతో మెస్సి కెరీర్ పూర్తిస్థాయిలో పరిపూర్ణమైందని అభిమానులు భావించారు.ప్రస్తుతం 38 ఏళ్ల వయస్సులో ఉన్న మెస్సి మరోసారి ప్రపంచకప్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే 2030 ప్రపంచకప్ సమయానికి అతడి వయస్సు 42 ఏళ్లు దాటే అవకాశం ఉంది. అందువల్ల FIFA 2026నే అతడి చివరి ప్రపంచకప్‌గా చాలా మంది భావిస్తున్నారు.
FIFA 2026 రొనాల్డో కల నెరవేరుతుందా?
క్రిస్టియానో రొనాల్డో పేరు వినగానే రికార్డులు గుర్తుకొస్తాయి. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన రొనాల్డో ఎన్నో ఘనతలు సాధించాడు.కానీ ప్రపంచకప్ టైటిల్ మాత్రం ఇప్పటికీ అతడికి అందని ద్రాక్షగానే మిగిలింది. ఐదు ప్రపంచకప్‌ల్లో పాల్గొన్నప్పటికీ ట్రోఫీని ముద్దాడలేకపోయాడు.ప్రస్తుతం 41 ఏళ్ల వయస్సులో ఉన్న రొనాల్డోకు ఇది చివరి అవకాశం కావొచ్చు. 2030 ప్రపంచకప్ నాటికి అతడి వయస్సు 45 ఏళ్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌లో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని రొనాల్డో అభిమానులు ఆశిస్తున్నారు.
FIFA 2026 గాయాలతో ఇబ్బంది పడుతున్న నెయ్‌మార్
బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. మెస్సి, రొనాల్డో తర్వాత అత్యధిక ఆదరణ పొందిన ఫుట్‌బాల్ స్టార్లలో నెయ్‌మార్ ఒకడు.అయితే అతడి కెరీర్‌ను తరచూ గాయాలు వెంటాడుతున్నాయి. అనేక కీలక టోర్నీల్లో గాయాల కారణంగా పూర్తి స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రస్తుతం 34 ఏళ్ల వయస్సులో ఉన్న నెయ్‌మార్‌కు కూడా ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.బ్రెజిల్‌కు మరోసారి ప్రపంచకప్ అందించాలనే లక్ష్యంతో అతడు బరిలోకి దిగుతున్నాడు.
FIFA 2026 జర్మనీకి నోయర్ చివరి ప్రయాణం
ప్రపంచంలో అత్యుత్తమ గోల్‌కీపర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన మాన్యూల్ నోయర్ కూడా FIFA 2026లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.40 ఏళ్ల వయస్సులో ఉన్న నోయర్ ఇప్పటికే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నప్పటికీ, జర్మనీ జట్టుకు అవసరమైన సమయంలో మళ్లీ జట్టులోకి వచ్చినట్లు సమాచారం. ఈ టోర్నీ అనంతరం అతడు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
FIFA 2026 వీరికి కూడా ఇదే చివరి ప్రపంచకప్ కావొచ్చు
ఫుట్‌బాల్ ప్రపంచంలో అనుభవజ్ఞులైన మరికొందరు స్టార్ ఆటగాళ్లు కూడా FIFA 2026 తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పే అవకాశాలు ఉన్నాయి.
ఆ జాబితాలో:
గులియెర్మో ఓచోవా (మెక్సికో)
మహ్మద్ సలాహ్ (ఈజిప్ట్)
నికోలస్ ఒటామెండి (అర్జెంటీనా)
కాసెమిరో (బ్రెజిల్)
జేమ్స్ రోడ్రిగెస్ (కొలంబియా)
సన్ హ్యూంగ్-మిన్ (దక్షిణ కొరియా) వంటి ఆటగాళ్లు ఉన్నారు. కొత్త తరం స్టార్‌లకు వేదిక మెస్సి, రొనాల్డో, నెయ్‌మార్ వంటి దిగ్గజాల యుగం ముగింపుకు చేరుకుంటున్న వేళ, కొత్త తరం ఫుట్‌బాల్ స్టార్‌లు ప్రపంచకప్ వేదికపై తమ ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. 2026 ప్రపంచకప్ ఒకవైపు లెజెండ్స్‌కు వీడ్కోలు టోర్నీగా నిలవగా, మరోవైపు భవిష్యత్ సూపర్‌స్టార్ల ఆరంగేట్రానికి వేదికగా మారనుంది. FIFA World Cup 2026 ఫుట్‌బాల్ అభిమానులకు ప్రత్యేకమైన టోర్నీగా నిలవనుంది. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిన మెస్సి, రొనాల్డో వంటి దిగ్గజాలు చివరిసారి ప్రపంచకప్ వేదికపై కనిపించే అవకాశం ఉండటంతో ఈ టోర్నీపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ లెజెండ్స్ తమ కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపు ఇస్తారా? లేక యువ ఆటగాళ్లు కొత్త చరిత్ర సృష్టిస్తారా? అనేది చూడాల్సి ఉంది.







