T20 World Cup 2026 Final India vs New Zealand : టీ20 వరల్డ్ కప్ 2026: న్యూజిలాండ్‌పై 96 పరుగుల ఘనవిజయం, చరిత్ర సృష్టించిన టీమిండియా!

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 9 March 2026, 12:02 am

T20 World Cup 2026 Final India vs New Zealand : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అంచనాలను నిజం చేస్తూ, ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి మూడోసారి టీ20 విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంతో టీమిండియా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న Defending Champions తొలి జట్టుగా, స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా, అలాగే మూడుసార్లు (2007, 2024, 2026) కప్పు కొట్టిన ఏకైక జట్టుగా భారత జట్టు రికార్డులకెక్కింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్… రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించి కివీస్ కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

T20 World Cup 2026 Final India vs New Zealand : టీ20 వరల్డ్ కప్ 2026: న్యూజిలాండ్‌పై 96 పరుగుల ఘనవిజయం, చరిత్ర సృష్టించిన టీమిండియా!

T20 World Cup 2026 Final India vs New Zealand : టీ20 వరల్డ్ కప్ 2026: న్యూజిలాండ్‌పై 96 పరుగుల ఘనవిజయం, చరిత్ర సృష్టించిన టీమిండియా!

T20 World Cup 2026 Final India vs New Zealand దూకుడు ప్రదర్శించిన భారత బ్యాటర్లు

ఈ మహా సమరంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తెలిసినా, లక్ష్యాన్ని ఛేదించవచ్చనే ఉద్దేశ్యంతో కివీస్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, భారత ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి ఓవర్ నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. సంజు శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 98 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఔట్ కాగా, సంజు శాంసన్ కివీస్ బౌలర్లపై విలయతాండవం చేశాడు. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 89 పరుగులు సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం ఏమాత్రం తగ్గలేదు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో శివమ్ దూబే కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత జట్టు 255 పరుగుల రికార్డ్ స్కోరును నమోదు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు పడగొట్టినా, కివీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

T20 World Cup 2026 Final India vs New Zealand చతికిలబడ్డ న్యూజిలాండ్ బ్యాటింగ్

256 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఫామ్ లో ఉన్న కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ (9)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చగా, మరో డేంజరస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (1)ను జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన డైవింగ్ క్యాచ్ (ఇషాన్ కిషన్ పట్టుకున్నాడు) ద్వారా ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసే సరికి కివీస్ 52/3 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (52 పరుగులు), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (43 పరుగులు) మాత్రమే కాస్త పోరాటం కనబరిచారు. మిగతా బ్యాటర్లు భారత స్పిన్నర్లు, పేసర్ల దాటికి విలవిలలాడారు. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ‘బూమ్ బూమ్’ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటాడు.

సూర్యకుమార్ అద్భుతమైన కెప్టెన్సీ, అవార్డులు

ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో ఫాస్ట్ బౌలర్లను కాదని స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను రంగంలోకి దింపిన వ్యూహం అద్భుతంగా పని చేసింది. ఈ వరల్డ్ కప్ లో నిలకడగా రాణించి సెమీస్, ఫైనల్ లోనూ వరుసగా భారీ స్కోర్లు సాధించిన సంజు శాంసన్‌కు సగర్వంగా “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” అవార్డు దక్కింది. అలాగే, ఫైనల్ పోరులో తన అద్భుతమైన స్లో యార్కర్లు, కచ్చితమైన బౌలింగ్ తో 4 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించిన జస్ప్రీత్ బుమ్రా “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా నిలిచాడు. మొత్తంగా చూసుకుంటే, ఈ చరిత్రాత్మక విజయం భారత క్రికెట్ లో సువర్ణాక్షరాలతో లిఖించారు. క్రీడాభిమానుల హర్షధ్వానాల మధ్య, లక్షకు పైగా ఉన్న మోదీ స్టేడియంలో సూర్య సేన వరల్డ్ కప్ ట్రోఫీని గాల్లోకి ఎత్తి ముద్దాడిన క్షణం ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో ఉప్పొంగేలా చేసింది.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి