Ponnala Laxmaiah : కారు దిగనున్న పొన్నాల.. కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ.. భట్టి క్లారిటీ?
Ponnala Laxmaiah : తెలంగాణలో రాజకీయాలన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చుట్టే తిరుగుతున్నాయి. ఒక ఆరు నెలల వరకు అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ.. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా బలం పెరిగింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అంతే కాదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కూడా పెరిగింది. చాలామంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరుతుండటంతో ఒక్కసారి కాంగ్రెస్ కు విపరీతమైన క్రేజ్ రావడంతో బీఆర్ఎస్ పార్టీలో వణుకు ప్రారంభమైంది. దానికి తోడు పలు జాతీయ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయి. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి నేతలు క్యూ కట్టారు.
అయితే.. కాంగ్రెస్ లో టికెట్ దక్కదని భావించిన కొందరు నేతలు మాత్రం అసంతృప్తికి లోనయి వేరే పార్టీల వైపు మొగ్గ చూపుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సొంత నియోజకవర్గం జనగామలో రెండు సార్లు ఓడిపోయారు. గత ఎన్నికల్లో ముత్తిరెడ్డిపై ఓడిపోయారు. దీంతో మరోసారి టికెట్ ఇచ్చినా పొన్నాల లక్ష్మయ్య గెలవలేడని భావించిన అధిష్ఠానం టికెట్ నిరాకరించినట్టు తెలుస్తోంది. టికెట్ రాదని నిర్ధారించుకున్న పొన్నాల పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన మా పార్టీలోకి వస్తే మాకు సంతోషమే.. మేమే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తాం అని చెప్పి అన్నట్టుగా పొన్నాల ఇంటికి వెళ్లి మరీ పార్టీలో చేరిక గురించి కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరారు.
Ponnala Laxmaiah : మళ్లీ పొన్నాల యూటర్న్
పొన్నాల మళ్లీ పార్టీలోకి రావాలని.. ఆయన తమ బలం అని తాజాగా భట్టి విక్రమార్క అన్నారు. పొన్నాలకు బీఆర్ఎస్ లోనూ సీటు కన్ఫమ్ కాలేదు. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫమ్ చేసింది. దీంతో జనగామ నుంచి పొన్నాలకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు పొన్నాల సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భట్టి విక్రమార్కతో పొన్నాల ఈ విషయమై చర్చలు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ హస్తం గూటికి చేరేందుకు పొన్నాల సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.