Siricilla : యువతి కిడ్నాప్.. చివరకు ప్రేమ పెళ్లి.. కథ సుఖాంతం ఎలా అయిందంటే?
Siricilla : ఒక యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో అసలు ఏం జరిగిందో యువతి తల్లిదండ్రులకు కూడా అర్థం కాలేదు. నిజానికి ఆ యువతి ఎంగేజ్ మెంట్ జరిగిన తెల్లారే ఈ ఘటన జరగడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. తన కుటుంబ సభ్యుల ముందటే ముసుగులో వచ్చిన కొందరు యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. సిరిసిల్లలో ఈ ఘటన జరిగింది.
కట్ చేస్తే.. ఆ యువతిని కిడ్నాప్ చేసిన యువకుడే తనను పెళ్లి చేసుకున్నాడు. అదే ఈ కథలో ట్విస్ట్. సిరిసిల్ల జిల్లాల చందుర్తి మండలంలోని మూడపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి కిడ్నాప్ అని తెలియగానే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. కానీ.. అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అదే ఊరికి చెందిన జానీ, షాలిని ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు తనకు వేరే సంబంధాలు చూస్తుండటంతో షాలినీనే తనకు వేరే పెళ్లి చేస్తున్నారని తనను తీసుకెళ్లాలని చెప్పింది. దీంతో ఈ ప్లాన్ అంతా వర్కవుట్ చేశాడు జానీ. చివరకు నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. మేము ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకున్నాం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది షాలినీ.
Siricilla : ఇద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారన్న పోలీసులు
ఈ విషయం తెలిసి పోలీసులు ఆరా తీయగా.. ఇద్దరికి ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారని.. ఇద్దరూ మేజర్స్ కాబట్టి వాళ్ల పెళ్లి చెల్లుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇదివరకు ఈ సంవత్సరం జనవరి 25నే వాళ్లు పెళ్లి చేసుకున్నా.. అప్పటికీ ఆ యువతికి మైనర్ గానే ఉండటంతో ఆ పెళ్లి చెల్లలేదు. కానీ.. ఇప్పుడు యువతి మేజర్ కావడంతో వాళ్ల పెళ్లికి చట్టబద్ధత ఉందని పోలీసులు తెలపడంతో కథ అలా సుఖాంతం అయిపోయింది.