Mynampally : బీఆర్ఎస్‌కి మైనంపల్లి గుడ్ బై.. రేవంత్‌కి టచ్‌లోకి వచ్చిన మైనంపల్లి? ప్లాన్ బీ సిద్ధం
Mynampally : అనుకున్నదే జరిగింది. తనకు టికెట్ ప్రకటించినా కూడా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీని వీడారు. తన కొడుక్కి మెదక్ టికెట్ ఇవ్వలేదని అప్పటి నుంచి పార్టీపై కోపంతో ఉన్న మైనంపల్లి చివరకు పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు.. పార్టీలో ఇక కొనసాగబోనని.. తనకు ప్రకటించిన టికెట్ కూడా రద్దు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో మైనంపల్లి ఇక కాంగ్రెస్ లో చేరిక ఖాయం అయినట్టే అని అంటున్నారు.
నిజానికి మైనంపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తనకు, తన కొడుకుకు టికెట్ కన్ఫమ్ అయితే పార్టీలోకి రావడానికి తనకు అభ్యంతరం లేదని మైనంపల్లి స్పష్టం చేశారు. చాలా రోజుల పాటు తన అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించిన మైనంపల్లి చివరకు పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. తనకు కేటాయించిన టికెట్ ను కూడా తాను రిజెక్ట్ చేశానని మైనంపల్లి చెప్పుకొచ్చారు.
Mynampally : కాంగ్రెస్ లో చేరిక ఖాయమేనా?
ఇక.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక మైనంపల్లి తదుపరి ప్లాన్ ఏంటి అనేది తెలియడం లేదు. కానీ.. ఆయన ఇప్పటికే రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది ఖాయం అన్నట్టుగా వినిపిస్తోంది. మైనంపల్లికి మల్కాజిగిరి, తన కొడుకు రోహిత్ కు మెదక్ నుంచి కాంగ్రెస్ సీటు ఇచ్చేందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే.. మైనంపల్లి బీఆర్ఎస్ ను వీడినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మాత్రం చాలా వేడెక్కుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియడం లేదు. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి మరో వికెట్ పడిపోయినట్టే.