సాగర్ సమరంలో గెలుపు మూడు పార్టీలకు ఎంత ముఖ్యమో తెలుసా?
Nagarjuna Sagar by elections : తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగిసింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసింది. ఆ ఎన్నికలు ముగిశాయో లేదో అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికపై మొత్తం రాష్ట్ర యంత్రాంగం మొత్తం దృష్టి పెట్టింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అధికార టీఆర్‌ఎస్ పార్టీ విపక్ష బీజేపీ మరియు కాంగ్రెస్‌లు కూడా నాగార్జున సాగర్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మూడు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ఇప్పుడు మనం చూద్దాం.
మొదటగా అధికార టీఆర్‌ఎస్ పార్టీకి బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా దుబ్బాక ఉప ఎన్నిక మరియు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో షాక్ మీద షాక్ తగిలింది. దాంతో రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ హవా తగ్గింది అనే భావనకు వస్తున్నారు. బీజేపీ ఆ భావనను బలంగా కల్పించేందుకు గాను ప్రచారం చేస్తుంది. నాగార్జున సాగర్ లో కూడా టీఆర్‌ఎస్ ఓడిపోతే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ హవా తగ్గినట్లుగా మరింతగా ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాకపోవచ్చు అంటూ ప్రజల్లో భావన కలిగితే 2023 ఎన్నికల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ఇతర టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు సాగర్ పై గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించి ఇప్పటి వరకు తాము సాధించిన విజయాలు గాలి వాటం కాదు అని నిరూపించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ బలంగా ప్రచారం చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ బలం బాగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ బలం మరింతగా పెరిగి 2023 ఎన్నికల్లో సత్తా చాటాలంటే సాగర్ లో గెలవాలి. ఇక కాంగ్రెస్ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. ఇప్పటికే మూడువ స్థానంకు కాంగ్రెస్ పడిపోయినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కేసీఆర్ తీవ్రంగా కాంగ్రెస్ ను నష్టపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ కు దెబ్బ కొట్టేలా సాగర్ లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తుంది. జానా రెడ్డిని ఎంపిక చేసిన కాంగ్రెస్ ఆయన గెలిస్తే ఊపిరి పోసుకున్నట్లుగా అవుతుంది. మరి జానా రెడ్డి కాంగ్రెస్ కు ఉపిరి పోస్తాడా లేదంటే బీజేపీకి సాగర్ జనాలు మరింత బలం ఇస్తారా అదీ కాకుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంకు మద్దతుగా సాగర్ జనాలు నిలుస్తారా అనేది మే 2న కౌంటింగ్ తో క్లారిటీ వచ్చేస్తుంది.