Rythu Runa Mafi : రైతుల‌కి రుణ‌మాఫీ మార్గ‌ద‌ర‌కాలు విడుద‌ల‌.. అయితే ప్రామాణికం ఏంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Runa Mafi : రైతుల‌కి రుణ‌మాఫీ మార్గ‌ద‌ర‌కాలు విడుద‌ల‌.. అయితే ప్రామాణికం ఏంటంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2024,3:18 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Runa Mafi : రైతుల‌కి రుణ‌మాఫీ మార్గ‌ద‌ర‌కాలు విడుద‌ల‌.. అయితే ప్రామాణికం ఏంటంటే..!

Rythu Runa Mafi : గ‌త కొద్ది రోజులుగా రైతులు తెలంగాణ ప్ర‌భుత్వం నుండి శుభ‌వార్త వ‌స్తుంద‌ని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ పథకం, మార్గదర్శకాలను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రైతులందరికీ రెండు లక్షల మేర రుణాలను ఆగస్టు 15వరకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించ‌డంతో అంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ పథకం అమలు ప్రక్రియపై కసరత్తు చేసిన అధికారులు.. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మేరకు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయాడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Rythu Runa Mafi ఇవి ప్రామాణికం..

భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతు కుటుంబం గుర్తింపు కోసం ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుంది.2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 09 వరకు తీసుకున్నపంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది.తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తింపు ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తించనుంది.

12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09 డిసెంబర్ 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు వర్తిస్తుంది.09 డిసెంబర్ 2023 నాటికి బకాయి వున్న అసలు, వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. ఈ పథకానికి ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) ప్రామాణికం. వ్యవసాయ శాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోక్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్‌లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌కి బిల్లులు సమర్పించటం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే కంప్లయింట్స్ పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి.

ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక బ్యాంక్ నోడల్ అధికారిగా నియమించాలి. ఈ బ్యాంక్ నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎన్ఐసీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి. ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి రిఫరెన్స్-1 మెమో జత చేసినట్టి ప్రొఫార్మా-1లో డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు. కాబట్టి, పీఎసీఎస్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్, రిఫరెన్స్-2వ మెమో జత చేసినట్టి ప్రొఫార్మ-2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి బ్యాంకు సీబీఎస్ నుంచి సేకరించిన డేటాను యదాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం. అవసరమైతే వ్యవసాయశాఖ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి.

Rythu Runa Mafi రైతుల‌కి రుణ‌మాఫీ మార్గ‌ద‌ర‌కాలు విడుద‌ల‌ అయితే ప్రామాణికం ఏంటంటే

Rythu Runa Mafi : రైతుల‌కి రుణ‌మాఫీ మార్గ‌ద‌ర‌కాలు విడుద‌ల‌.. అయితే ప్రామాణికం ఏంటంటే..!

ఈ పథకం కింద లబ్ధిదారులు, రైతుకుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణఖాతాలోని ఆధార్‌ను పాస్ బుక్ డేటా బేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణ మొత్తం నుంచి రుణమాఫీ 2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది. అర్హతగల రుణ మాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులు రైతు రుణఖాతాలకు జమచేయనున్నారు. పీఎసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచ్‌కు విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పీఎసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు.ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు 2 లక్షలకు పైబడివున్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత.. అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.

2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్దతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి. ఈ రుణమాఫీ ఎస్‌హెచ్ఐలు, జెఎల్టీలు, ఆర్ఎంజీలు, ఎస్ఇసీఎస్‌కు తీసుకున్న రుణాలకు వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంటరుణాలకు వర్తించదు. కానీ పీఏసీఎస్ ద్వారా తీసుకున్న పంటరుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం-కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకోబడుతుంది అని తెలియ‌జేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది