khammam.. జిల్లాలో పాగా వేసేందుకు బీఎస్పీ ప్రయత్నాలు..
ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఉన్న ప్రవీణ్ బడుగుల రాజ్యాధికారం కోసం కార్యచరణ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో బీఎస్పీ పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నేపథ్యంలోనే ఈ నెల11న ఖమ్మంలో ‘బహుజన సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బుర్రా ఉపేందర్ సాహు తెలిపాడు. సభ జయప్రదం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో సత్తా చాటేందుకు బీఎస్పీ సమాయత్తమవుతున్నదని బుర్రా పేర్కొన్నారు. ఇకపోతే రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మూడు నియోజకవర్గాలు జనరల్‌గా ఉన్నాయి. ఈ క్రమంలోనే రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పట్టు సంపాదించుకునేందుకుగాను ఇప్పటి నుంచే బీఎస్పీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. జిల్లాలోని అన్ని వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రవీణ్ సభ తర్వాత జిల్లాలో బీఎస్పీ జోష్ కనబడుతుందని బీఎస్పీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.