Telangana Congress CM Candidate : తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు? కన్ఫ్యూజన్‌లో ప్రజలు?
Telangana Congress CM Candidate : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు అంటే టక్కున సీఎం కేసీఆర్ అని చెబుతారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. నేనే సీఎం అభ్యర్థిని అంటే నేనే సీఎం అభ్యర్థిని అంటూ మీడియా ముందు గొప్పలకు పోతాడు కాంగ్రెస్ నాయకులు. ఈ పార్టీలో నేనే అందరికంటే సీనియర్ నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ఒకరు అంటే.. నా వల్లే పార్టీ బలోపేతం అయింది.. పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి అంటే.. ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది అంటే దానికి కారణం నేనే అని ఇంకో నేత అంటాడు. ఇలా.. ఒక్కొక్కరి వాదనకు సంబంధం ఉండదు. దీంతో అసలు సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో తెలియక కాంగ్రెస్ హైకమాండ్ తల పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది.
ఏమో కాంగ్రెస్ గెలిస్తే నేనే సీఎం కావచ్చు.. అంటూ సీనియర్ నేత జానారెడ్డి మీడియా ముందు మాట్లాడారు. అసలు ఆయన ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మరి అలాంటప్పుడు సీఎం అభ్యర్థి ఎలా అవుతారు అని అంటూ కొందరు వాదిస్తున్నారు. నా కంటే సీనియర్లు ఎవ్వరూ లేరన్నారు జానారెడ్డి. 2014, 2018 ఎన్నికల్లోనూ జానారెడ్డి అదే విషయం చెప్పారు. ఇప్పుడు పోటీ చేయకున్నా 2023 ఎన్నికల్లో గెలిస్తే నేనే సీఎం అంటున్నారు. కానీ.. అసలు జానారెడ్డి సీఎం అయ్యే చాన్స్ ఉందా అంటే నూటికి నూరు శాతం లేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణలోని రెడ్డి కులానికి చెందిన వారందరినీ ఏకం చేసి పార్టీలోకి తీసుకొస్తున్నారు. అలాగే.. తాను చెప్పే వాళ్లకే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తోంది హైకమాండ్. భవిష్యత్తులో మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయం ఎలా ఉంటే.. ముఖ్యమంత్రి విషయంలో అధిష్ఠానం అలాంటి నిర్ణయమే తీసుకోనుంది. చాలామంది సీనియర్ నేతలను కట్టడి చేయడంలోనూ రేవంత్ సఫలం అయ్యారు. అందరినీ తన వైపునకు తిప్పుకోవడంలోనూ రేవంత్ సఫలం అయ్యారు.
Telangana Congress CM Candidate : రేవంత్ రెడ్డి సీఎం అవుతారా?
కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అవుతారా? అంటే సీనియర్ నేతల విషయంలో అడ్డంకులు రానున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వాళ్లు ఊరుకుంటారా? భట్టి విక్రమార్క పేరు కూడా వినిపిస్తోంది. దళిత నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. జనంలో ఉంటారు. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించుకునే అవకాశం ఉంది. లేదంటే గిరిజన బిడ్డ సీతక్కను ముఖ్యమంత్రిగా చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ గా తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను రేవంత్ రెడ్డికి అధిష్ఠానం అప్పగించడంతో.. ఎలా చూసినా కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అవుతారు అనే దానిపై ఎలాంటి సందేహం లేదు.