Karthika Deepam 2 March 3rd 2026 Episode : దశరథ కన్నీటి పర్యంతం.. త్యాగానికి సిద్ధమైన దీప.. కాశీ ప్లాన్‌కు దాసు ఫిదా

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 March 2026,8:37 am

Karthika Deepam 2 March 3rd 2026 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగుతోంది. నేటి మార్చి 3 ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా, ఎంతో ఉద్విగ్నభరితంగా సాగింది. తల్లి సుమిత్రను బతికించుకోవడానికి దీప తీసుకున్న నిర్ణయం అందరి కంటతడి పెట్టిస్తుంది. ఇంతకీ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Karthika Deepam 2 March 3rd 2026 Episode : దశరథ కన్నీటి పర్యంతం.. త్యాగానికి సిద్ధమైన దీప.. కాశీ ప్లాన్‌కు దాసు ఫిదా

Karthika Deepam 2 March 3rd 2026 Episode : దశరథ కన్నీటి పర్యంతం.. త్యాగానికి సిద్ధమైన దీప.. కాశీ ప్లాన్‌కు దాసు ఫిదా

సుమిత్ర పరిస్థితి చూసి దశరథ ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అక్కడికి కార్తీక్, దీప వచ్చి అతన్ని ఓదారుస్తారు. అప్పుడు దశరథ ఎంతో ఎమోషనల్ అవుతాడు. “ఒకేసారి రెండు వరాలు పొందినట్లు, నా కూతురితో పాటు కూతురి బిడ్డ కూడా రాబోతుందని ఎంతో సంతోషించాను. నా కూతురి విషయంలో నేను చేసిన తప్పును.. మనవరాలి విషయంలో సరిదిద్దుకోవాలి అనుకున్నాను. అది పుట్టినప్పటి నుంచి నా ఒడిలోనే పెరగాలని ఆశపడ్డాను. నా కూతురి తొలి అడుగులు, తొలి పిలుపు మిస్ అయ్యాను. ఈ ఆశలన్నీ పుట్టబోయే బిడ్డతో తీర్చుకోవాలి అనుకున్నాను. నా చెల్లి ఏమో దీప కడుపున మా అమ్మే మళ్లీ పుడుతుందని సంబరపడుతోంది. ఇప్పుడు నేను ఎంతమంది ఆశలను, కలలను చంపేయాలి? ఎవరిని వదులుకోవాలి?” అని గుండె పగిలేలా ఏడుస్తాడు దశరథ.

అప్పుడు కార్తీక్.. “మీ అత్త ప్రాణం నిలబెట్టే దేవత ఈ దేవతే అని నాకు అప్పుడు తెలియదు.. కడుపున పుట్టిన బిడ్డను అడుగుతున్నాను, నేను తండ్రిగా నీకు ఏమిచ్చానని నీ నుంచి ఇంత పెద్ద త్యాగాన్ని కోరుకోవాలి?” అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీనికి దీప బదులిస్తూ.. “నాకు జన్మనిచ్చారు కదా నాన్న. తల్లిదండ్రుల కళ్లలో కన్నీళ్లు తుడవలేకపోతే నా జన్మ ఎందుకు? వాళ్ల రుణం తీర్చుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ అవకాశం నా బిడ్డకు వచ్చింది. నా బిడ్డ నా కన్నతల్లిని కాపాడుతుందంటే అంతకుమించి ఆనందం ఏముంది? ఈ బిడ్డ నాలో నుంచి నా తల్లి ప్రాణంలోకి పోతుంది.. అప్పుడు నాకు బిడ్డ అయినా, తల్లి అయినా ఆ అమ్మే కదా.. సరే అనండి నాన్న, అమ్మను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం” అని ధైర్యంగా చెబుతుంది. ఆ మాటలకు దశరథ చేతులెత్తి దండం పెడతాడు.

Karthika Deepam 2 March 3rd 2026 Episode జ్యోత్స్న ఎంట్రీ.. కవర్ చేసిన కార్తీక్

అదే సమయానికి అక్కడికి జ్యోత్స్న వస్తుంది. “ఏంటా సమస్య.. ఏంటా పరిష్కారం?” అని నిలదీస్తుంది. వెంటనే వెనుక శివనారాయణ, పారిజాతం కూడా వస్తారు. పారు కూడా మధ్యలో పుల్ల వేస్తుంది. కార్తీక్ వెంటనే తేరుకుని విషయాన్ని కవర్ చేస్తాడు. “సమస్య ఎవరో కాదు జ్యోత్స్న మేడమే.. అత్తకు ఆపరేషన్ అన్న ప్రతిసారి తను లగేజ్ సర్దుకుని ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది కదా. అదే డాక్టర్‌తో మాట్లాడి ఆసుపత్రిలో జాయిన్ చేద్దాం అంటే భయపడుతుంది. తను వెళ్లిపోతే అదో పెద్ద సమస్య.. అందుకే ఈ ఇంటికి నేనే కాపలాగా ఉంటానని పరిష్కారం చెప్పాను” అని కౌంటర్ వేస్తాడు. డాడీతో వీళ్ళు ఏదో సీరియస్ గా మాట్లాడుతుంటే నేను అడిగేసరికి మాట మార్చారు అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.

మరోవైపు కాశీ-స్వప్న విడాకుల విషయంపై కాశీ మీద దాసు తీవ్ర స్థాయిలో మండిపడతాడు. విడాకుల పేపర్ల మీద పెట్టింది సంతకం కాదు, వదిలేసుకున్న జీవితం అని బాధపడతాడు. విడిపోవడానికేనా ఇన్ని ఎదురు దెబ్బలు తిని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంది అని ప్రశ్నిస్తాడు. దానికి కాశీ బదులిస్తూ.. “నేను విడాకుల కాగితాలపై సంతకం మాత్రమే పెట్టాను, కానీ స్వప్నను వదులుకోను. ఇదొక ట్రిక్. ఇప్పుడు స్వప్న ప్రశాంతంగా ఉంటుంది. నేను మళ్లీ తనను ప్రేమించి నా ప్రేమను గెలుచుకుంటాను, మళ్లీ పెళ్లి చేసుకుంటాను నాన్న” అని తన అసలు ప్లాన్ చెబుతాడు. ఆ మాటలు విన్న దాసు ఎంతో సంతోషించి కొడుకుకి ఆల్ ది బెస్ట్ చెబుతాడు.

Karthika Deepam 2 March 3rd 2026 Episode జ్యోత్స్నకు శివనారాయణ దిమ్మతిరిగే కౌంటర్

ఇక సుమిత్రకు ఆపరేషన్ అయ్యేవరకు ఎక్కడికి వెళ్లొద్దని శివనారాయణ జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే కార్తీక్, దీప వచ్చి తాము రేపటి నుంచి డ్యూటీకి రావడం లేదని, నెల రోజులు లీవ్ కావాలని అడుగుతారు. దీనికి జ్యోత్స్న అడ్డుపడుతుంది. “దీప ఈ ఇంటి పనిమనిషి, బావ డ్రైవర్. పనివాళ్ల బాధ్యత మాదే. నెల రోజుల పాటు వాళ్లు ఏ పనీ చేయకుండా ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు” అంటూ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతుంది.

దీనికి కార్తీక్ దీటుగా బదులిస్తాడు. తాము పనివాళ్లమని, తమ హద్దుల్లో తాముంటామని చెబుతాడు. అప్పుడు శివనారాయణ కల్పించుకుని.. “నీకు అగ్రిమెంట్ ప్రామాణికం అయితే, కార్తీక్ కట్టాల్సిన 10 కోట్ల ఫైన్ నేను కడతాను. కార్తీక్.. మీరు వెళ్లొచ్చు, ఎప్పుడంటే అప్పుడు తిరిగి రావొచ్చు” అని లీవ్ మంజూరు చేస్తాడు. ఆ దెబ్బకు జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ షాక్ అవుతారు.

అసలు నిజం వినేసిన పారిజాతం

కార్తీక్, దీప బయటకు వెళుతుండగా దశరథ ఆపి అసలు కారణం అడుగుతాడు. “దీపను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఈ నేచర్ మన దగ్గర నుంచి అపురూపమైనది తీసుకుని అమూల్యమైనది ఇస్తుంది. దేవుడు నా బిడ్డను తీసుకుని, నా అత్తను నాకు తిరిగి ఇస్తున్నాడు” అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. “దీప కడుపులోని బిడ్డను వదులుకోవడం అంటే నా మనసు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు” అని దశరథ అంటాడు. వీళ్లు మాట్లాడుకుంటున్న ఈ అత్యంత రహస్యమైన, సున్నితమైన విషయాన్ని చాటుగా ఉండి పారిజాతం వినేస్తుంది. దీప తన బిడ్డను వదులుకోవడం తప్ప వేరే దారి లేదని కార్తీక్ చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్‌లో పారిజాతం ఈ నిజాన్ని జ్యోత్స్నకు చెబుతుందా? దీపను అడ్డుకోవడానికి పారు ఇంకేం కుట్రలు చేయబోతోంది? తదితర విషయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి