Karthika Deepam 2 Today Episode August 13th : జ్యోత్స్న కోసం సూరజ్ పోరాటం.. మాలిని భారీ స్కెచ్!
Karthika Deepam 2 Today Episode August 13th జ్యోత్స్న కార్తీక్ గిఫ్ట్‌లను తిరిగి ఇచ్చేయడం, సూరజ్‌తో భావోద్వేగ సంభాషణ, సుమిత్ర ఆగ్రహం, రెస్టారెంట్ కోసం దీప-మాలిని పోటీ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Karthika Deepam 2 Today Episode August 13th : కార్తీక దీపం 2 ఆగస్టు 13 ఎపిసోడ్ 748లో కథ మరింత ఆసక్తికరంగా మారింది. కార్తీక్ ఇచ్చిన గిఫ్ట్‌లు, జ్ఞాపకాలను జ్యోత్స్న తిరిగి ఇచ్చేయడంతో ఇంట్లో ఒక్కసారిగా ఉద్విగ్న పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు జ్యోత్స్నను అర్థం చేసుకునేందుకు సూరజ్ ప్రయత్నిస్తుండగా.. సుమిత్ర మాత్రం తన కూతురి పరిస్థితికి సూరజ్‌నే కారణమంటూ నిలదీస్తుంది. ఇక మరోవైపు రెస్టారెంట్ విషయంలో మాలిని, దీప కుటుంబాల మధ్య పోటీ మొదలవుతుంది. స్టాఫ్‌ను తొలగించాలన్న మాలిని నిర్ణయానికి దీప ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎపిసోడ్‌లో కాంచన ఇంటికి బ్యాగ్ తీసుకుని వచ్చిన జ్యోత్స్న అందరికీ షాకిచ్చింది. తన బావ కార్తీక్ తన కోసం ఇన్నాళ్లు ఇచ్చిన గిఫ్ట్‌లన్నింటినీ తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పింది. ఇంతకాలం బావ తనను వద్దనుకున్నాడని, ఇప్పుడు తానే బావను వద్దనుకుంటున్నానని జ్యోత్స్న స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి కార్తీక్ ఇచ్చిన ప్రతి వస్తువును ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వాటి గురించి చెబుతూ తిరిగి ఇచ్చేసింది.అది చూసిన దీప కూడా జ్యోత్స్నను ప్రశ్నించింది. కార్తీక్ నీకు గిఫ్ట్‌లు ఇవ్వడం తప్ప.. జ్యోత్స్న నుంచి ఆయన ఏమీ తీసుకోలేదా? అని అడిగింది. ఇంతలో సూరజ్ అక్కడికి రావడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే రెస్టారెంట్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడేందుకే తానే సూరజ్‌ను పిలిపించానని కార్తీక్ చెప్పడంతో పరిస్థితి కాస్త సర్దుకుంది.
Karthika Deepam 2 Today Episode August 13th : జ్యోత్స్న కోసం సూరజ్ పోరాటం.. మాలిని భారీ స్కెచ్!
Karthika Deepam 2 Today Episode August 13th జ్యోత్స్న ఒంటరితనం.. సూరజ్‌తో భావోద్వేగ సంభాషణ
అందరం కలిసి భోజనం చేద్దామని కార్తీక్ చెప్పిన సమయంలో కూడా జ్యోత్స్న ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె కింద కూర్చోవడంతో మరోసారి ఇంట్లో వాళ్లు షాక్ అయ్యారు. అదే సమయంలో సూరజ్ అనుకోకుండా జ్యోత్స్నపై కాలు వేయడంతో ఆమె ఇబ్బందిగా ఫీలైంది. ఈ విషయాన్ని గమనించిన కార్తీక్, దీప నవ్వుకున్నారు.సూరజ్ అంకుల్ కూడా జ్యోత్స్నలాగే సాంబార్‌ను చాలా ఇష్టంగా తింటున్నాడని శౌర్య చెప్పడంతో.. కొందరికి తమ ఇష్టాన్ని, మనసులోని భావాలను బయటకు చెప్పడం సాధ్యం కాదని, దానికి కూడా సర్టిఫికెట్ అడుగుతారని జ్యోత్స్న కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత జ్యోత్స్న తన ప్లేట్‌ను కూడా కడిగి తీసుకురావడంతో.. ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి చాలా అదృష్టవంతుడని కార్తీక్ అన్నాడు.తాను ఇంటికి వెళ్తానని జ్యోత్స్న చెప్పడంతో.. ఆ ప్రాంతంలో క్యాబ్ సర్వీసులు తక్కువగా ఉంటాయని, సూరజ్ కూడా అదే వైపు వెళ్తున్నాడు కాబట్టి అతనితో వెళ్లమని కార్తీక్ సూచించాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఎవరి మాటా వినకుండా ఒంటరిగానే వెళ్లిపోయింది. ఇది గత ఎపిసోడ్‌లో ప్రధానంగా నిలిచిన అంశం. మరి ఆగస్టు 13న ప్రసారమైన 748వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.క్యాబ్ బుక్ కాకపోవడంతో జ్యోత్స్న ఆందోళన చెందుతుంది. ఇంతలో సూరజ్ అక్కడికి వచ్చి తాను లిఫ్ట్ ఇస్తానని చెబుతాడు. అయితే తనకు లిఫ్ట్ అవసరం లేదని, తానే వెళ్లిపోతానని జ్యోత్స్న చెబుతుంది. కానీ సూరజ్ మాత్రం ఇది తన స్కూటీ అని, అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లగలనని అంటాడు. కావాలంటే తనను డ్రైవర్‌గా భావించమని చెబుతాడు.
అంతేకాదు.. వర్షం వచ్చేలా ఉందని, జ్యోత్స్న ఇంటికి చేరకపోతే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారని సూరజ్ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. చివరకు జ్యోత్స్న అతనితో వెళ్లేందుకు అంగీకరిస్తుంది. ఇంటి దగ్గర దించేసిన తర్వాత సూరజ్‌కు జ్యోత్స్న థ్యాంక్స్ చెబుతుంది. అప్పుడు సూరజ్ అసలు విషయాన్ని బయటపెడతాడు. తన మనసులో జ్యోత్స్న లేదని ఆమె తనకు తానే నమ్మించుకోవడానికి చాలా ప్రయత్నిస్తోందని అంటాడు.తన మనసులో ఇప్పుడు ఎవరికీ స్థానం లేదని జ్యోత్స్న చెప్పడంతో.. కనీసం నీకు నువ్వైనా నీ మనసులో ఉన్నావా? అంటూ సూరజ్ ప్రశ్నిస్తాడు. తన మాటను అర్థం చేయించేందుకు చిక్కుడుకాయ కూర ఉదాహరణను చెబుతాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు తనకు చిక్కుడుకాయ కూర అంటే ఎంతో ఇష్టమని, తాను ఎక్కడ ఉన్నా ఆ ఇష్టాన్ని మర్చిపోలేనని చెబుతాడు.ఇప్పుడు చిక్కుడుకాయను బయటపడేసి.. ఇక దానిపై తనకు ప్రేమ లేదని చెబితే నమ్ముతావా? అలాగే ఎవరో ఇచ్చిన వస్తువులను తిరిగి ఇచ్చేసినంత మాత్రాన మనసులో ఉన్న ప్రేమ కూడా పోతుందా? అని సూరజ్ ప్రశ్నిస్తాడు.
అందుకు జ్యోత్స్న కూడా తన మనసులోని మాటను స్పష్టంగా చెబుతుంది. ఒకప్పుడు తన బావ అంటే ప్రాణమని, అందుకే ఆయన ఇచ్చిన వస్తువులన్నింటినీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నానని అంటుంది. కానీ ఇప్పుడు ఆయనంటే తనకు ఇష్టం లేదని, అందుకే ఆ వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేశానని చెబుతుంది. ఇంకా ఆలోచిస్తే తన బావపై ఉన్నది ప్రేమ కాదని.. కేవలం పంతమే అని తనకు అర్థమైందని చెబుతుంది. అలాంటప్పుడు ఆ వస్తువులు తన దగ్గర ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ వాటిని తిరిగి ఇచ్చేశానని స్పష్టం చేస్తుంది. అది తన ఇష్టమని, తాను ఏ విధంగా అర్థం చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని జ్యోత్స్న తేల్చి చెబుతుంది.
Karthika Deepam 2 Today Episode August 13th సుమిత్ర ఆగ్రహం.. జ్యోత్స్న కోసం సూరజ్ ప్రయత్నం
మరోవైపు ఉదయాన్నే సూరజ్‌ను సుమిత్ర పిలిపిస్తుంది. తన కూతురు జ్యోత్స్న నీ వల్ల ఎంతో బాధపడుతోందని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాను ఏం చేశానని సూరజ్ ప్రశ్నించగా.. నువ్వు జ్యోత్స్నను పెళ్లి చేసుకోనని చెప్పినప్పటి నుంచి తన కూతురు తనకే కొత్తగా కనిపిస్తోందని సుమిత్ర అంటుంది.ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదని, సరిగ్గా భోజనం కూడా చేయడం లేదని చెబుతుంది. అంతేకాదు, గత రాత్రి జరిగిన విషయం కూడా సూరజ్‌కు తెలుసని గుర్తుచేస్తుంది. కార్తీక్ జ్యోత్స్నకు ఇచ్చిన వస్తువులన్నింటినీ ఆమె తిరిగి ఇచ్చేసిందని చెబుతుంది. అది ఒకరకంగా మంచి పరిణామమే అయినప్పటికీ.. జ్యోత్స్న ఆ స్థితిలో ఉండటాన్ని తాము చూడలేకపోతున్నామని సుమిత్ర బాధపడుతుంది.ఇదంతా నీ వల్లే జరుగుతోందని, నువ్వే జ్యోత్స్నను బాధపెడుతున్నావని సుమిత్ర సూరజ్‌ను నిలదీస్తుంది. జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్న విషయం తమకు తెలుసని చెబుతుంది. ఎందుకంటే కార్తీక్, జ్యోత్స్నకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నది కూడా తామేనని గుర్తుచేస్తుంది.అప్పుడు సూరజ్ కూడా కీలకమైన ప్రశ్నలు వేస్తాడు. కార్తీక్ దీప మెడలో తాళి కట్టిన తర్వాత ఆయన ఇక జ్యోత్స్నకు భర్త కాలేడని మీకు తెలిసినప్పుడు ఏం చేశారని అడుగుతాడు. జ్యోత్స్నను మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారని ప్రశ్నిస్తాడు.
చాలా రకాలుగా చెప్పి చూశామని, చివరకు ఇంటి నుంచి కూడా గెంటేశామని సుమిత్ర, దశరథ చెబుతారు. అయితే సూరజ్ మాత్రం వారి ప్రయత్నం తప్పు దిశలో సాగిందని అంటాడు. ఇన్ని రోజులు జ్యోత్స్న అనే మనిషిని మార్చేందుకు మాత్రమే ప్రయత్నించారని, కానీ ఆమె మనసును మార్చేందుకు ప్రయత్నించలేదని చెబుతాడు. అందుకే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని స్పష్టం చేస్తాడు.జ్యోత్స్నను మార్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నం కూడా సుమిత్రకు అర్థమైందని చెబుతాడు. బాధపడుతున్న మనసును బలవంతంగా మార్చాల్సిన అవసరం లేదని, మాట్లాడటం ద్వారా కూడా ఒకరి మనసును మార్చవచ్చని సూరజ్ అంటాడు.జ్యోత్స్న ఏడుస్తున్న విషయం సూరజ్‌కు కనిపిస్తుందా అని దీప కూడా ప్రశ్నిస్తుంది. అయితే ఈరోజు జ్యోత్స్న బాధపడుతున్నా.. భవిష్యత్తులో తన మనసును తానే అర్థం చేసుకున్న రోజు ఆమె కళ్లలో కన్నీళ్లు ఉండవని సూరజ్ చెబుతాడు.
జ్యోత్స్న అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని సూరజ్ అంటాడు. అందుకే ఆమె మనసులో మార్పు రావాలని కోరుకుంటున్నానని చెబుతాడు. ఇప్పటికే ఆమెలో మార్పు మొదలైందని కూడా అంటాడు. ఫొటోలు, గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేయడం వల్ల ఆమె మనసు పూర్తిగా మారిపోదని.. తాను కోరుకున్న రోజున ఆమె మనసు నిజంగా మారిందని తనకు అర్థమవుతుందని సూరజ్ చెబుతాడు.జ్యోత్స్నను మార్చేందుకు సూరజ్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడని, తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని దశరథ అంటాడు. దీంతో జ్యోత్స్న విషయంలో కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆలోచన వేర్వేరుగా ఉందనే విషయం స్పష్టమవుతుంది.
Karthika Deepam 2 Today Episode August 13th రెస్టారెంట్ కోసం మొదలైన కొత్త పోరు
ఇదిలా ఉంటే.. కథ మరో కీలక మలుపు తిరుగుతుంది. గౌరీ ప్రసాద్ అనే హోటల్ యజమాని తన రెస్టారెంట్‌ను విక్రయించేందుకు ప్రతిపాదన తీసుకురావడంతో శివన్నారాయణ రెండు ఆప్షన్లు ఇస్తాడు. ఒకటి మొత్తం రెస్టారెంట్‌ను కొనుగోలు చేయడం కాగా.. రెండోది జ్యోత్స్నను ఆ రెస్టారెంట్‌లో భాగం చేయడం.అయితే గౌరీ ప్రసాద్ మాత్రం ఆ రెస్టారెంట్‌ను శివన్నారాయణకు అమ్మలేనని చెబుతాడు. ఎందుకంటే దాన్ని వేరొకరికి విక్రయిస్తానని ఇప్పటికే మాట ఇచ్చానని స్పష్టం చేస్తాడు. అది ఎవరికి అని శివన్నారాయణ అడగగానే.. తమకే రెస్టారెంట్‌ను ఇస్తానని గౌరీ ప్రసాద్ మాటిచ్చాడని మాలిని చెబుతుంది.మాకు మాటిచ్చిన వ్యక్తి మీకు ఎలా అమ్ముతాడని దక్షిణామూర్తి ప్రశ్నిస్తాడు. ఎంత మొత్తం కావాలో చెప్పాలని, వెంటనే అగ్రిమెంట్ చేసుకుందామని మాలిని అంటుంది. లేదంటే ఈ రెస్టారెంట్‌ను దక్కించుకోవాలని ఇంకా చాలామంది పోటీకి రావచ్చని చెబుతుంది.అయితే గౌరీ ప్రసాద్‌కు ఈ రెస్టారెంట్‌తో కేవలం వ్యాపార సంబంధం మాత్రమే లేదు. అది తన తండ్రి జ్ఞాపకమని చెబుతాడు. అక్కడ పనిచేసే సిబ్బందిని తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామని వివరిస్తాడు. రెస్టారెంట్‌ను ఎవరు తీసుకున్నా సిబ్బందిని మాత్రం మార్చకూడదని, వారి జీవితాలు రోడ్డున పడటం తనకు ఇష్టం లేదని చెబుతాడు. అంతేకాదు, రెస్టారెంట్‌ను చివరి వరకు రెస్టారెంట్‌గానే కొనసాగిస్తామని హామీ ఇవ్వాలని కోరుతాడు.
ఈ షరతులతో డీల్ తమకు ఓకేనని శివన్నారాయణ చెబుతాడు. అయితే దక్షిణామూర్తి మాత్రం గౌరీ ప్రసాద్ తమకే అమ్ముతానని మాట ఇచ్చాడని గుర్తుచేస్తాడు. ఎలాగైనా ఈ రెస్టారెంట్‌ను తామే సొంతం చేసుకోవాలని శివన్నారాయణ, దక్షిణామూర్తి పట్టుదలగా నిర్ణయించుకుంటారు.రెస్టారెంట్ తనకే కావాలని, దాన్ని దక్కించుకోవడానికి మిగతావాళ్లు ఏం చేస్తారో తనకు తెలియదని శివన్నారాయణ దీపతో చెబుతాడు. అగ్రిమెంట్ సిద్ధం చేయించుకుని రావాలని దక్షిణామూర్తి కూడా ఆదేశిస్తాడు.మరోవైపు మాలిని మాత్రం గౌరీ ప్రసాద్ పెట్టిన సిబ్బంది, రెస్టారెంట్‌కు సంబంధించిన షరతులను తాము పట్టించుకోబోమని స్పష్టం చేస్తుంది. కానీ దీప మాత్రం ఆ ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నామని చెబుతుంది.రెస్టారెంట్‌లో నష్టాలు తీసుకొచ్చిన సిబ్బందిని కొనసాగించడం తనకు సాధ్యం కాదని మాలిని అంటుంది. అందుకు దీప.. తాను ఆ రెస్టారెంట్‌ను లాభాల్లోకి తీసుకొస్తానని ధైర్యంగా చెబుతుంది. గౌరీశంకర్ కూడా కీలకంగా స్పందిస్తూ.. తాను మాలినికి మాట ఇచ్చానని, అయితే అందుకే సిబ్బందికి అన్యాయం చేయలేనని అంటాడు.
అప్పుడు సూరజ్ ఒక కొత్త ఆలోచనను ముందుకు తీసుకొస్తాడు. ఈ రెస్టారెంట్ ఎవరి చేతుల్లోకి వెళ్లాలనేది సిబ్బందికే అప్పగిద్దామని సూచిస్తాడు. వాళ్లు ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. ఆ నిర్ణయం ప్రకారమే ముందుకు సాగాలని చెబుతాడు. ఈ ఆలోచనకు గౌరీ ప్రసాద్, మాలిని కూడా అంగీకరిస్తారు.ఇక దక్షిణామూర్తి మాత్రం తాను ప్రతిసారీ ఓడిపోనని, ఈసారి ఎలాగైనా రెస్టారెంట్‌ను గెలుచుకుంటామని శివన్నారాయణతో అంటాడు.
Karthika Deepam 2 Today Episode August 13th మాలిని భారీ ఆఫర్.. దీపకు కొత్త బాధ్యత
ఆ తర్వాత గౌరీ ప్రసాద్ రెస్టారెంట్ సిబ్బందితో సమావేశం నిర్వహిస్తాడు. ఈ సందర్భంగా మాలిని తన నిర్ణయాన్ని నేరుగా వెల్లడిస్తుంది. తాను రెస్టారెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత అక్కడ పనిచేస్తున్న వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తానని చెబుతుంది.ఉన్నట్టుండి ఉద్యోగం పోతే ఎవరికైనా ఇబ్బందేనని భావించిన మాలిని.. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తానని ఆఫర్ పెడుతుంది. ఉద్యోగం కొనసాగించడానికి బదులుగా డబ్బు తీసుకుని వెళ్లిపోవాలని ఆమె ప్రతిపాదిస్తుంది.ఇదంతా జరుగుతున్న సమయంలో దీప జ్యోత్స్నకు కీలకమైన బాధ్యత అప్పగిస్తుంది. ఇక ఈ విషయం గురించి నువ్వే మాట్లాడాలని జ్యోత్స్నతో చెబుతుంది.తాను జ్యోత్స్న రెస్టారెంట్‌కు కేవలం సీఈవో మాత్రమేనని, కానీ జ్యోత్స్న ఛైర్మన్ గారి మనవరాలని దీప గుర్తుచేస్తుంది. అంతేకాదు, ఆమెకు అండగా సూరజ్ కూడా ఉన్నాడని చెబుతూ.. ఇప్పుడు నువ్వే ముందుకు వచ్చి మాట్లాడాలని జ్యోత్స్నను ప్రోత్సహిస్తుంది.
అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మాలిని తేలికగా తీసుకుంటుంది. రెస్టారెంట్ వ్యవహారం వంట చేయడం లాగా అంత ఈజీ కాదంటూ జ్యోత్స్నపై సెటైర్ వేస్తుంది.ఇలా జ్యోత్స్న వ్యక్తిగత జీవితంలో సూరజ్‌తో భావోద్వేగ పోరాటం కొనసాగుతుండగా.. మరోవైపు రెస్టారెంట్ విషయంలో దీప, మాలిని మధ్య పోటీ మరింత ముదురుతుంది. రెస్టారెంట్‌ను ఎవరు సొంతం చేసుకుంటారు? సిబ్బంది ఎవరికి మద్దతు ఇస్తారు? జ్యోత్స్న ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తుంది? సూరజ్ ప్రయత్నం వల్ల జ్యోత్స్న మనసులో నిజంగా మార్పు వస్తుందా? అనే ప్రశ్నలతో ఈ ఎపిసోడ్ ముగిసింది.







