pawan kalyan : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎవరి దగ్గర స్థలం కొన్నాడు, ఆ స్థలం స్పెషాలిటీ ఏంటి?
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ సారి ఎన్నికల్లో పవన్.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే అక్కడి ప్రజలకి సేవ చేసుకుంటూ అక్కడే ఉండడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల స్థానికంగా స్థలం కొనుగోలు చేశారు.. బుధవారం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు ఒకటి.. 2.08 ఎకరాలు మరో బిట్ స్థలం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ భూమికి సంబంధించి.. బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు.
pawan kalyan స్థలం ఖరీదు ఎంత..
అయితే పవన్ స్థలం ఎక్కడుంది, ఎవరి దగ్గర నుంచి ఎంతకు కొన్నారని తెలుసుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ కొన్న స్థలం పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఉంది. ఇక్కడ ఎకరం 15 నుంచి 16 లక్షలు రూపాయలు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. ఏలేరు కాలువ సమీపంలో ఈ స్థలం ఉందని వడ్లమూడి అప్పారావు అనే స్థానిక రైతు తెలిపారు. కాకినాడ రైతుకు చెందిన 16 ఎకరాల్లో 3 ఎకరాల చిల్లర పవన్ కొన్నారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఇక్కడ స్థలం కొనడం వల్ల పిఠాపురానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని, పవన్ స్థలం పక్కన తనకు 11 సెంట్ల స్థలం ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో.. రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగసభలో డిప్యూటీ సీఎం ప్రజల ముందే ప్రకటించారు. కాని ఎన్నికల సమయంలో పవన్ పిఠాపురంలో ఉండనని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని ఆయన నిరూపించారు.
పిఠాపురంలో ఇల్లు కట్టుకుని తరచూ వస్తుంటానని, క్యాంపు కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇక రీసెంట్‌గా బహిరంగ సభ కూడా అక్కడ ఏర్పాటు చేశారు పవన్. ఆ సభలో నియోజకవర్గం ప్రజలు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానేనని.. కానీ తనకు చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు పవన్ కళ్యాణ్. కొంతమంది వారి వాహనాల నంబర్ ప్లేట్‌లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకున్నారని.. ఒకవేళ రవాణా శాఖ అధికారులు నంబర్ ప్లేట్లు చూసి అడిగినా.. వన్‌వేలో తప్పుగా వెళ్లి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనకూడదని.. ఎవరైనా సరే చట్టాలు, రూల్స్ పాటించాలని కోరారు.