Pawan Kalyan ; రైతుల పాస్ పుస్తకాలపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో .. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!!
మరో వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పడుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి జగన్ పై వార్ ని ప్రకటించాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని వై.యస్.జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం మారుస్తూ కొత్త ఇన్చార్జిలను నియమిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై వై.యస్.జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు అని ప్రశ్నించారు. అలాగే పొలాల్లో వేసే సరిహద్దు రాళ్లపై కూడా జగన్ ఫోటో ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ లాజిక్ తీస్తున్నారు. సమగ్ర భూ రక్ష చట్టంపై జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదులు ఒక విషయంపై మాట్లాడితే పవన్ మరో విషయాన్ని ప్రస్తావించి తన మనసులోని మాటలను బయట పెట్టారు. సమగ్ర భూ రక్ష చట్టంలో సమస్యలు ఉన్నాయంటూ విజయవాడ బార్ అసోసియేషన్ కి చెందిన కొందరు ఆందోళన చేపట్టారు. హైకోర్టు వద్ద కూడా వారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మద్దతు కోసం కొంతమంది జనసేన పార్టీ ఆఫీస్ కి వచ్చారు.
వారి మాటలు విన్న పవన్ కళ్యాణ్ ఆందోళనకు మద్దతు ఇస్తా అన్నారు. ఆ సమయంలోనే భూ రక్ష చట్టంపై స్పందించే విషయంలో జగన్ ఫోటో ఎందుకు అని ప్రశ్నించారు. ఆ అంశంపై మరింత అధ్యయనం చేస్తామన్నారు. విశాఖలో దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు సమగ్ర భూ రక్ష చట్టం తీసుకొచ్చారని ప్రశ్నించారు. సమగ్ర భూ రక్ష చట్టం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అని కూడా చెప్పారు. ఇక పాసు పుస్తకాల్లో రైతు ఫోటో చిన్నదిగా సీఎం ఫోటో పెద్దదిగా ఉండడంతో రైతుల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అలా ఫోటోలు వేయడం ఏం హక్కు ఉందని, అది రైతుల తాతల నాటి ఆస్తి అని, వారికే హక్కు ఉంటుందని, అలాంటప్పుడు సీఎం ఫోటో ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.