Buddha Venkanna : వైసీపీకి వచ్చిన సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు.. బుద్ధా వెంకన్న సెటైర్లు
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ లక్కీ నంబర్ 11 అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. ఈ నంబర్‌కు సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించారు. “అసెంబ్లీలో సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు, అవినీతిపై బుద్ధా వెంకన్న ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా “జగన్ అధికారంలో ఉన్నపుడు కల్తీ మద్యంతో చనిపోయినవారి వివరాలు తెలుసుకోడానికి యాప్ అవసరం” అని అన్నారు. అలాగే “లిక్కర్ స్కాంలో ఎన్ని కోట్లు దోచుకున్నారో తెలుసుకోవడానికి యాప్ అవసరం” అని ఎద్దేవా చేశారు.
బుద్ధా వెంకన్న చేసిన ఈ విమర్శలు కొత్తగా ఎన్నికైన టీడీపీ ప్రభుత్వానికి, గత వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధంలో భాగమే. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వై.ఎస్.ఆర్.సి.పి.కి కేవలం 11 సీట్లు రావడాన్ని, లిక్కర్ స్కాంలో తెరపైకి వచ్చిన రూ.11 కోట్ల వ్యవహారాన్ని కలిపి బుద్ధా వెంకన్న వ్యంగ్యంగా సంధించిన ఈ విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, రాజకీయ వేధింపులను నమోదు చేసేందుకు వైసీపీ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్టు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులపై అక్రమంగా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Buddha Venkanna : వైసీపీకి వచ్చిన సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు.. బుద్ధా వెంకన్న సెటైర్లు
ఈ క్రమంలో ఎవరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నా, ప్రభుత్వ అధికారులు లేదా కూటమి నేతలు బలవంతాలు చేస్తుంటే సంబంధిత వివరాలను యాప్ లో నమోదు చేయాలని జగన్ సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను డిజిటల్ ఫార్మాట్లో సేకరించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. దీనిద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అధికార దుర్వినియోగాన్ని నిర్ధారించిన ఆధారాలుగా కూడా వాడే అవకాశముందని చెప్పారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక, ఈ యాప్‌లో నమోదైన ఫిర్యాదులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ప్రజల భద్రత, న్యాయబద్ధత కోసం ఈ యాప్ ఒక సాధనంగా నిలవనుందని తెలిపారు. దీనికి కౌంటర్ గా టీడీపీ నేత వెంకన్న మాట్లాడాడు.