Ys jagan : బాబును చిత్తూరు లో చిత్తు చేస్తున్నజగన్మోహన్ రెడ్డి … అయ్యో పాపం
Ys jagan : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే కడప జిల్లాలో వైసీపీ తప్పించి, మరే పార్టీ ఉనికి కనిపించదు. ఎంత కష్టపడ్డా, కడప జిల్లాలో వైసీపీ మినహా మరో పార్టీకి అవకాశమే ఉండదు. మరి.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా ఇప్పుడాయనకు అందని ఆకాశంలా మారిందట. దీంతో అక్కడ మళ్లీ తిరుగులేని ఆధిక్యం తెచ్చుకోవడమే ఆయన ముందున్న కొత్త సవాల్ లా తయారైందట. దీంతో గతంలో ఎప్పుడూ ఎదురుకాని గడ్డు పరిస్థితిని ఆయనిప్పుడు ఎదుర్కొంటున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆయనకు తగులుతున్న ఎదురుదెబ్బలు అన్నిఇన్ని కావు. అప్పటివరకు పక్కనే ఉన్న సన్నిహిత నేతలు అయితే బీజేపీ.. కాదంటే వైసీపీలోకి జంప్ కావటం ఒక ఎత్తు అయితే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలో తనకు ఎదురుగాలి ఎక్కువై ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది…
2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాల్ని వైసీపీ సొంతం చేసుకోవటం ద్వారా.. క్లీన్ స్వీప్ కు కాస్త దూరంలో ఆగింది. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో కూడా మొదటి రెండు రౌండ్లలో వెనుకబడి ఉండటం అప్పట్లో షాకింగ్ గా మారింది. కిందామీదా పడి అధిక్యతను ప్రదర్శించి బయటపడటంతో టీడీపీ ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్ని రాజకీయ పార్టీలకు ముడి పెట్టలేమని ఎంత చెబుతున్నా.. ఫలితాల్ని చూసినప్పుడు టీడీపీ అధిక్యత భారీగా తగ్గిపోయింది. జిల్లాలోని 80 శాతానికి పైగా పంచాయితీల్ని అధికార వైసీపీ సానుభూతిపరులు సొంతం చేసుకున్నారు. చివరకు బాబు సొంత గ్రామమైన నారావారిపల్లె ఉన్న కందులవారిపల్లె పంచాయితీలోనూ వైసీపీ గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 500 ఓట్ల తేడాతో టీడీపీ గెలవటంతో తెలుగు తమ్ముళ్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. దీంతో సాధారణ ఎన్నికల్లో బాబు పరిస్థితి ఏమిటన్నది విశ్లేషకుల మదిలో మెదిలిన ప్రశ్నకు .. పురపోరు మరింత ఆజ్యం పోసిందట.
తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే చిత్తూరులో 50 డివిజన్లు ఉంటే 37 ఏకగ్రీవం కాగా, తిరుపతిలోని 50 డివిజన్లలో 27 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అయిన స్థానాల్లో అత్యధికం అధికార వైసీపీకి చెందినవి కావటం గమనార్హం. మొత్తంగా.. మున్సిపల్ఎన్నికల అనంతరం చిత్తూరు జిల్లాలో టీడీపీ బలం మరింతగా తగ్గిపోనుందని చెప్పక తప్పదు. ఇది బాబుకు మరింత ఇబ్బందికి గురి చేయటం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో టీడీపీకి చిత్తూరు జిల్లాలో పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం బాబు భుజాలపై పడింది. ముఖ్యంగా తన నియోజకవర్గమైన కుప్పంలో క్షేత్రస్థాయి పరిస్థితులు ఆయనకు మరింత టెన్షన్ ను పెంచుతున్నాయని అటు కేడర్, ఇటు విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గెలుపు కన్నా ఇప్పుడు కుప్పంలో మెజార్టీ నిలబెట్టుకోవడమే బాబు ముందున్న అసలు సవాల్ అని ప్రత్యర్థులు అంటున్నారట. దీంతో వచ్చే ఎన్నికల్లో సీటు కాపాడుకోవాల్సిన పరిస్థితి బాబుకు ఎదురైనట్లే.. పాతకాలపు సామెత .. ఇంట గెలవాలన్న ఆలోచన ఇప్పుడు బాబుకు చుక్కలు చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.