YS Sharmila Vs Roja : మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila Vs Roja : మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల..!

 Authored By aruna | The Telugu News | Updated on :12 February 2024,4:10 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila Vs Roja : మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల..!

YS Sharmila Vs Roja : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రానికి ద్రోహం చేయడమే కాకుండా వైయస్ జగన్ కు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలోకి వైయస్ షర్మిల ఏ ముఖం పెట్టుకొని చేరారని విమర్శించారు. వైజాగ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రోజా వైయస్ షర్మిలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. వైయస్సార్ బ్రతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసేవారని చెప్పిన వైయస్ షర్మిల ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆ పార్టీలో చేరారు అంటూ ప్రశ్నించారు. వైయస్ జగన్ ను జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని మండిపడ్డారు. యాత్రలు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేశారో వైయస్ షర్మిల చెప్పాలని మంత్రి రోజా అన్నారు. కుదిరితే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు వైయస్ షర్మిల తీసుకురావాలని సవాల్ చేశారు.

ఇక రోజా వ్యాఖ్యలకు స్పందించిన వైఎస్ షర్మిల ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నగరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో మాట్లాడిన వైఎస్ షర్మిల రోజా మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా.. నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ.. ఈమెతో పాటు రోజా అన్నలు, భర్త కలిపి నగరి నియోజకవర్గానికి నలుగురు మంత్రులు. ఇసుక, మట్టి, గ్రావెల్, స్థలాలు ఇలా అన్ని దోపిడీ. ఎక్కడ చూసినా అవినీతే అంటూ షర్మిల రోజాపై విమర్శలు గుప్పించారు. రోజాను ఒకప్పుడు ఐరన్ లెగ్ అనే వారన్న వైఎస్ షర్మిల అప్పట్లో వైయస్సార్ ను పంచె విప్పతీసి కొడతానంటూ ఆమె చేసిన మాటలు గుర్తున్నాయని అన్నారు. ఇక తన గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదన్నారు. తనను ప్రేమించినంతగా వైయస్సార్ ఎవరిని ప్రేమించలేదని, వైయస్సార్ కు గౌరవం లేని చోట తాను ఉండలేనని కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ అంటే ఉన్న అపారమైన గౌరవంతోనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు.

ఇక తెలంగాణలో వైయస్సార్ టీపీని మూసేశారు అంటూ వస్తున్న విమర్శలపై వైయస్ షర్మిల స్పందించారు. తెలంగాణలో వైయస్ఆర్ టీపీని మూసేయలేదని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ఉన్నంతవరకు వైయస్సార్ టీపీ కూడా పార్టీలో భాగమే అని అన్నారు. గొప్ప ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరానన్న వైయస్ షర్మిల ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు అన్ని వస్తాయని అన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన డబ్బులు తేవాలంటూ రోజా చేస్తున్న విమర్శలపై వైయస్ షర్మిల స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నేను డబ్బులు తీసుకువస్తే మీరు గాడిదలు కాస్తున్నారా అంటూ వైసీపీ మంత్రులపై మండిపడ్డారు. కేసీఆర్ తో ఇన్నాళ్లు దోస్తీ చేసిన వైసీపీ నేతలు రాష్ట్ర విభజన సమస్యలు అప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని పారేసుకోకు రోజా అని షర్మిల సలహా ఇచ్చారు. తెలంగాణలో తనపై అధిక ప్రసంగం చేసిన వాళ్లను జనాలు ఓడగట్టిన విషయం గుర్తు చేసుకోవాలంటూ హెచ్చరించారు. వారంతా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారని రేపు రోజా గతి కూడా అంతేనని వ్యాఖ్యానించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది