Business idea : పంజాబ్ నుంచి పోలాండ్ కు స్వచ్ఛమైన నెయ్యిని ఎక్స్ పోర్ట్ చేస్తూ నెలకు 20లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఎలాగో తెలుసా?
Business idea : ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరిపై కరోనా ప్రభావం చూపింది. కొవిడ్ లాక్ డౌన్ తో అనేక రంగాలు అతలాకుతలం అయ్యాయి. తీవ్ర నష్టాలను చవి చూశాయి. కొన్ని సంస్థలు మూతపడ్డాయి. కొందరు మాత్రం కరోనా సంక్షోభంలోనూ మంచి లాభాలు గడించారు. మరికొందరు ఈ కాలాన్ని తమ అభివృద్ధికి వాడుకున్నారు. థానెలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన కమల్ జిత్ కౌర్ పై కూడా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనా సోకగా దాని నుంచి అతి కష్టం మీద బయటపడ్డారు. చావు వరకు వెళ్లి వచ్చిన స్థితి నుంచి ఇప్పుడు ఏకంగా లక్షలు సంపాదిస్తున్నారు. పంజాబ్ నుండి పొలాండ్‌కు స్వచ్ఛమైన బిలోనా నెయ్యిని ఎక్స్‌పోర్ట్ చేస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.
కరోనా సంక్షోభం తర్వాత ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఆమెను వ్యాపారం వైపు మళ్లించింది. తాను పుట్టి పెరిగిన లూథియానాలోని ఒక చిన్న గ్రామంలో విరివిగా దొరికే స్వచ్ఛమైన పాలనే తన ముడిసరుకుగా వాడటం మొదలు పెట్టి వ్యాపారం అంచెలంచెలుగా విస్తరిస్తున్నారు. తాజా పాలతో నెయ్యి, పనీర్ వాటితో పాటు పాలతో చేసిన ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దాదాపు మూడు నెలల మార్కెట్ పరిశోధన తర్వాత డిసెంబర్ 2020లో కిమ్ముస్ కిచెన్ ప్రారంభించారు. ఇది ఫామ్-ఫ్రెష్ నెయ్యిలో ప్రత్యేకత కలిగిన స్టార్టప్, ఇందులో ఏ రకమైన రసాయనాలు కలపకుండా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
మొదట్లో ముంబ్రాలో దొరికే పాలను సేకరించి వాటితోనే ఉత్పత్తులను చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది కమల్‌జిత్‌కు. ఎన్ని రకాలుగా చేసినా.. రుచిలో మాత్రం తేడా వచ్చేది. తన ఉత్పత్తుల రుచి మరియు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్న కమల్‌జిత్… లూథియానాలోని తన గ్రామం నుండి ముంబ్రాకు పాలను రవాణా చేసి దాని నుంచే ఉత్పత్తులను తయారు చేయాలని భావించారు. నెయ్యి తయారీకి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ, కమల్‌జిత్ సాంప్రదాయ బిలోనా పద్ధతినే అనుసరిస్తున్నారు. ఇదే వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చెందడానికి కారణమైందని చెబుతారు కమల్ జిత్.