Business Idea : లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి.. తందూరీ చౌమీన్ అమ్ముతూ నెలకు లక్షలు సంపాదిస్తున్న యువ జంట
Business Idea : వ్యాపారం చేయాలని, నలుగురికి ఉపాధి కలిగించాలని, తమదైన పంథాలో జీవితాన్ని గడపాలని చాలా మంది కలలు కంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ధైర్యంగా ముందడుగు వేయగలరు. అలా వేసి కష్టపడి పని చేసే వారికి విజయం దాసోహం అంటుంది. నలుగురిలో ప్రత్యేక గుర్తింపు వస్తుంది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన మోహిత్ అరోరా, ఆయన భార్య మహేక్ ఈ కోవకే చెందినవారు. వారు కన్న కలల కోసం లక్షల జీతాన్ని సైతం వదులుకున్నారు.మెహిత్ అరోరా కెమికల్ ఇంజినీర్ కాగా, ఆయన భార్య మహేక్ కాస్మోటాలజిస్ట్. వీరిద్దరికి సొంతంగా బిజినెస్ చేయాలని కోరిక ఉండేది. ఏ రంగంలోకి అడుగుపెట్టాలో కచ్చితంగా తెలియదు. దానిపైనే భార్యభర్తలిద్దరూ తర్జనభర్జన పడ్డారు. చివరికీ ఫుడ్ రంగంలో అడుగుపెట్టాలని నిశ్చయించుకున్నారు.
మోహిత్ వంటలు బాగా చేయడం కూడా ఒక కారణం. ఫుడ్ కియోస్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.దాని వల్ల తక్కువ నష్టాలు వస్తాయి. రిస్క్ చాలా తక్కువ కాబట్టి దానివైపే మొగ్గారు. దంపతులిద్దరూ.. తమ ఉద్యోగాలకు 6 నెలల లాంగ్ లీవ్ పెట్టారు. ఒకవేళ వ్యాపారం ఆశించిన మేర నడవకపోతే తిరిగి ఉద్యోగాలు చేయాలన్నది వారి ఉద్దేశం. 2019లో సెక్టార్ 7కి సమీపంలోని అయోధ్య చౌక్‌లోని ఒక ప్రదేశంలో ఒక కియోస్క్‌ని ప్రారంభించారు.వారాంతాల్లో కేవలం రెండు వస్తువులను మాత్రమే విక్రయించే వారు. వారి కియోస్క్ కు ది బాస్ కేఫ్ అనే పేరు పెట్టుకున్నారు. ఇది సోయా చాప్, సోయా డెలికేసీ మరియు మోమోస్ అందించేవారు. రూ. 50,000 పెట్టుబడి పెట్టారు. వ్యాపారంలో సహాయం చేయడానికి వారి బంధువు కూడా వారితో చేరారు.
వ్యాపారాన్ని స్థాపించడంలో, అలాగే లాజిస్టికల్ సమస్యలను ఎదుర్కొన్నారు మొదట్లో. స్కూటర్ గ్యారేజ్‌లోని చిన్న షెడ్‌లో ప్రారంభించారు.ఇతరుల నుండి తమను తాము విభిన్నంగా ఉండేలా చూసుకున్నారు. వంటకాల్లో తేడాలను స్పష్టంగా చూపించారు. తందూరి చౌ మే అనే కొత్త రకం వంటకాన్ని పరిచయం చేశారు. క్రమంగా వారు అందించే మెను సంఖ్యను పెంచుతూ పోయారు. కరోనా లాక్ డౌన్ తో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ.. లాక్ డౌన్ ఆంక్షలన్నీ తొలగిపోయాక తిరిగి వారి కియోస్క్ ను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నారు. ఇప్పుడు వారికి నెలకు రూ.3 లక్షల ఆదాయం వస్తోంది. భవిష్యత్తులో రెస్టారెంట్‌ను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.