KCC Loan for Farmers : రైతన్నలకు శుభవార్త: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణ సదుపాయం..ఎలా పొందాలో తెలుసా మీకు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCC Loan for Farmers : రైతన్నలకు శుభవార్త: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణ సదుపాయం..ఎలా పొందాలో తెలుసా మీకు ?

 Authored By suma | The Telugu News | Updated on :20 January 2026,7:00 pm

ప్రధానాంశాలు:

  •  KCC Loan for Farmers : రైతన్నలకు శుభవార్త: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణ సదుపాయం..ఎలా పొందాలో తెలుసా మీకు ?

KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పెరుగుతున్న సాగు ఖర్చులు వాతావరణ మార్పుల ప్రభావం ప్రకృతి వైపరీత్యాల మధ్య కూడా వ్యవసాయం కొనసాగిస్తున్న రైతులకు తక్కువ వడ్డీకే రుణం అందించేలా కిసాన్ క్రెడిట్ కార్డు (Kisan Credit Card – KCC) పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేస్తోంది. ఈ కార్డు ద్వారా ఇప్పుడు రైతులు రూ.5 లక్షల వరకు వ్యవసాయ రుణం పొందవచ్చు. ముఖ్యంగా రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు కేవలం 4 శాతం వడ్డీకే లోన్ లభించడం ఈ పథకంలోని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వ్యవసాయం రోజురోజుకూ ఖర్చుతో కూడుకున్న రంగంగా మారుతున్న వేళ ప్రైవేట్ అప్పుల భారంతో రైతులు కష్టాలు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంట బీమా, వ్యవసాయ సబ్సిడీలు వంటి పథకాలను అమలు చేస్తోంది. వీటన్నిటిలో తక్షణ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే అత్యంత కీలక పథకం కిసాన్ క్రెడిట్ కార్డే అని చెప్పవచ్చు.

Loan up to Rs 5 lakh to farmers through Kisan Credit Card

KCC Loan for Farmers: రైతన్నలకు శుభవార్త: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణ సదుపాయం..ఎలా పొందాలో తెలుసా మీకు ?

KCC Loan for Farmers: కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఏమిటి?

కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రైతులకు ప్రత్యేకంగా రూపొందించిన వ్యవసాయ రుణ సదుపాయం. ఇది ఏటీఎం కార్డు తరహాలో పనిచేస్తుంది. రైతు తనకు అవసరమైన సమయంలో బ్యాంకు మంజూరు చేసిన రుణ పరిమితిలో అవసరమైనంత మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు, సాగునీటి అవసరాలు వంటి అన్ని వ్యవసాయ అవసరాలకు ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చు. రైతు కలిగి ఉన్న భూమి విస్తీర్ణం పంట రకం, గత రుణాల చెల్లింపు చరిత్ర ఆధారంగా బ్యాంకులు రుణ పరిమితిని నిర్ణయిస్తాయి. ఈ పథకం 1998లో ప్రారంభమై నాబార్డ్ (NABARD) పర్యవేక్షణలో అమలవుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 14 కోట్లకు పైగా రైతులు ఈ కార్డు ద్వారా రుణ సదుపాయం పొందుతున్నారు. 2026లోనూ రైతులకు సులభంగా రుణాలు అందేలా ఈ పథకం కొనసాగుతోంది.

KCC Loan for Farmers: తక్కువ వడ్డీ, ఎక్కువ లాభం

కిసాన్ క్రెడిట్ కార్డుపై ప్రాథమిక వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ వడ్డీ సబ్సిడీ ద్వారా రైతులకు 2 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు, రుణాన్ని సకాలంలో చెల్లించిన రైతులకు మరో 3 శాతం ప్రోత్సాహక తగ్గింపు అందుతుంది. ఇలా మొత్తం కలిపి రైతుకు కేవలం 4 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. ఈ రుణంలో రూ.1.6 లక్షల వరకు ఎలాంటి హామీ లేదా పూచీకత్తు అవసరం ఉండదు. అంటే ఈ పరిమితి వరకు రైతులు భూమి లేదా ఇతర ఆస్తులను భద్రతగా చూపించాల్సిన అవసరం లేదు. అయితే రూ.1.6 లక్షలకంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకోవాలంటే సంబంధిత బ్యాంకుల నిబంధనల ప్రకారం భూమి లేదా ఇతర ఆస్తులను పూచీకత్తుగా చూపించాల్సి ఉంటుంది.

KCC Loan for Farmers: బీమా రక్షణతో పాటు దరఖాస్తు విధానం

కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులకు రుణంతో పాటు ప్రభుత్వ బీమా పథకాల ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) ద్వారా పంట నష్టాలకు రక్షణ లభిస్తే ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) ద్వారా వ్యక్తిగత ప్రమాద బీమా కూడా పొందవచ్చు. దీని వల్ల రైతు కుటుంబానికి ఆర్థిక భద్రత మరింత బలపడుతుంది. రైతులు తమకు సమీపంలోని జాతీయీకృత బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా గ్రామీణ బ్యాంకులను సంప్రదించి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలతో దరఖాస్తు సమర్పించిన తర్వాత బ్యాంకు అధికారులు పరిశీలించి కార్డును జారీ చేస్తారు. అలాగే పీఎం కిసాన్ లబ్ధిదారులు పీఎం కిసాన్ పోర్టల్ లేదా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
అధిక వడ్డీలతో ప్రైవేట్ అప్పులు రైతన్నను కుంగదీస్తున్న ఈ రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు నిజమైన ఆర్థిక భరోసాగా నిలుస్తోంది. కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల వరకు రుణం అదీ సులభమైన విధానంలో లభించడం రైతులకు దక్కిన గొప్ప అవకాశమే. మీకు ఇంకా KCC లేకపోతే ఇప్పుడే సమీప బ్యాంక్ లేదా పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది