Shramik Mahila Vikas Sangh : 3000తో ప్రారంభించారు.. ఇప్పుడు సంవత్సరానికి 3 కోట్లు సంపాదిస్తున్నారు
Shramik Mahila Vikas Sangh : సుమిత్ర సింఘే. తనది ముంబైలోని వసాయ్ ప్రాంతం. తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన భర్తను కోల్పోయింది సుమిత్ర. అప్పుడు తన కొడుకు 5 ఏళ్లు ఉంటాడు. తన భర్త చనిపోవడంతో.. డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయింది తనకు. ఎవ్వరూ సహాయం చేసేవాళ్లు లేరు. పనికోసం వెతుక్కుంటున్న సమయంలో.. తనకు శ్రామిక్ మహిళా వికాస్ సంఘ్ అనే ఓ సంస్థ గురించి తెలిసింది. ఆ సంస్థ మగదిక్కులేని, ఎటువంటి ఆధారం లేని సుమిత్ర లాంటి మహిళల కోసం ప్రారంభించిందే.
కట్ చేస్తే.. ఇప్పుడు సుమిత్రకు 53 ఏళ్లు ఉంటాయి. ఇప్పుడు సుమిత్ర తన కాళ్ల మీద తాను నిలబడింది. తన కొడుకును మంచి చదువు చదివించగలిగింది. తన కొడుకుకు ఇప్పుడు 25 ఏళ్లు. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. తను ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఆ సంస్థే.
Shramik Mahila Vikas Sangh : ఈ సంస్థ ద్వారా అసలేం చేస్తారు?
1991లో ఒక ట్రస్ట్ గా ఏర్పడింది ఇది. ఇప్పటి వరకు సుమారు 300 మంది మహిళలకు ఉపాధిని చూపించింది ఈ సంస్థ. ముఖ్యంగా ఎటువంటి సంపాదన ఆధారం లేనివాళ్లు, మగదిక్కు లేని వాళ్లను చేరదీసి.. వాళ్లకు వంటకు సంబంధించిన నైపుణ్యాలను అందించి దాన్నే తమ వృత్తిగా ఎంచుకొని నాలుగు రాళ్లు సంపాదించుకునేలా చేసింది ఈ ట్రస్ట్.
ఈ ట్రస్ట్ ను ఇందుమతి బార్వే అనే ఓ టీచర్ ప్రారంభించారు. ఆమెది కూడా వసాయ్ ప్రాంతమే. ఆమెతో పాటు.. తన ముగ్గురు ఫ్రెండ్స్ ఉష మనేరికర్, జయశ్రీ సామంత్, సుభదా కొత్తవాలె కూడా ఈ ట్రస్ట్ లో సభ్యులు. ఈ నలుగురు మహిళలు వివిధ రకాల వృత్తుల నుంచి వచ్చిన వాళ్లు. ఒకరు టీచర్, మరొకరు గృహిణి, ఇంకొకరు సోషల్ వర్కర్.. ఇలా.. రకరకాల బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. పేద మహిళలకు చేయందించడం కోసం రూపొందిందే ఈ ట్రస్ట్.
నలుగురు మహిళలు కలిసి.. తమ వద్ద ఉన్న డబ్బును అంతా పోగేస్తే.. 3000 రూపాయలు అయ్యాయి. వాటితో ట్రస్ట్ ను ప్రారంభించారు. వీళ్లు ఏడుగురు పేద మహిళలను గుర్తించి.. వాళ్లతో పలు రకాల వంటలు వండించి.. వాటిని బస్ డ్రైవర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, వర్కింగ్ బ్యాచ్ లర్స్ లాంటి వాళ్లందరికీ పెట్టేవారు. అలా ప్రారంభమైన ఈ ట్రస్ట్.. 2021 సంవత్సరం వచ్చేసరికి 6 ఔట్ లెట్స్ కు చేరుకుంది. ప్రస్తుతం సంవత్సరానికి ఈ ట్రస్ట్ టర్నోవర్ 3 కోట్లు. ప్రస్తుతం ఈ సంస్థలో 175 మంది మహిళలు పనిచేస్తున్నారు.
వీళ్ల ఔట్ లెట్స్ ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రుల్లో ఉన్నాయి. అక్కడ తక్కువ ధరకే మంచి నాణ్యమైన ఫుడ్ ను వీళ్లు అందిస్తున్నారు. అన్నింటినీ లాభాల కోసమే కాకుండా.. కొన్ని సెంటర్లలో చాలా తక్కువ ధరకే ఫుడ్ ను అందిస్తున్నారు. ఏమాత్రం ఆధారం లేని మహిళలు కూడా ఈ సంస్థను నమ్ముకొని ఇప్పుడు సెటిల్ అయ్యారు. వాళ్లను నెలకు టైమ్ టు టైమ్ శాలరీలు అందుతాయి. అన్నీ పకడ్బందీగా ఉంటాయి. అందుకే.. చాలామంది పేద మహిళలు ఈ సంస్థలో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.